విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారు

సిఎం నిర్ణయంతో పోడు రైతులకు మేలు: జోగు
ఆదిలాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : పోడు భూములకు శాశ్వత పరిష్రకారం చూపాలన్న సిఎం కెసిఆర్‌ నిర్ణయం సాహసోపేతమని మాజీమంత్రి, ఎమ్మెల్యే జోగురామన్నఅన్నారు. ఎన్నో ఏళ్లుగా సమస్య నానుతోందని అన్నారు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అందులో భాగంగా ఎకరాకు రూ.10వేలు అందజేస్తోందని పునరుద్ఘాటించారు. గిరిజనులకు సైతం ఇది వర్తింప చేస్తామని సిఎం ప్రకటించారని అన్నారు. జిల్లాలోని పత్తి కొనుగోళ్లకు సంబంధించి రైతులకు లాభం చేకూరేలా ధర విషయంలో ముఖ్యమంత్రిని కోరుతామని తెలిపారు. వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలో తేమ శాతం ఎక్కువగా ఉందని, రైతులు నిరాశ చెందొద్దని, వారు సూచించిన ధరను చెల్లిస్తున్నట్లు వివరించారు. రైతులకు మద్దతు ధర లభించేలా రైతు సమన్వయ సమితులు కృషి చేయాలని సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. గతంలో రికార్డులను సరిచేయాలని రెవెన్యూ
కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేదని, సీఎం కేసీఆర్‌ రైతుల ఇబ్బందులను గమనించి అధికారులను మన వద్దకే పంపి సరిచేయిస్తున్నాడన్నారు. గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన సదస్సులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. భూరికార్డుల ప్రక్షాళన మండలంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ రంగంలోకి దిగుతుందని, అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసారని మార్కెట్‌ కమిటీ నాయకులు సూచించారు. సజావుగా కొనుగోళ్లు సాగుతున్నాయని అన్నారు. జిల్లా కేంద్రానికి సవిూప ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాకర్లు, వ్యాన్‌లు, ఇతర వాహనాల్లో రైతులు పత్తిని విక్రయించేందుకు మార్కెట్‌యార్డుకు తీసుకువస్తున్నారు. కొనుగోళ్లకు సంబంధించి రైతుల సమక్షంలో వ్యాపారులతో చర్చలు జరిపారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణం చల్లగా మారి పంటలో తేమ విషయంలో కొంత మేర సందిగ్ధత నెలకొంది. రైతులు మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చిన పత్తిలో తేమను పరిశీలించి కొనుగోలు చేస్తారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో తాము నష్టపోయే ప్రమాదం ఉందని వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు.