విమోచనోత్సవాలను విస్మరించడం దారుణం: సిపిఐ

పెద్దపల్లి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): విమోచనోత్సవాలను విస్మరించడం ద్వారా అధికార టిఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల ఆశయాలకు గండికొట్టిందని సిపిఐ విమర్శించింది. స్థానిక కార్యాలయంలో అమరవీరులకు నివాళి అర్పించారు. జెండా ఎగురవేసి తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. రాజకార్ల నుం/-చి విముక్తి కల్పించేందుకు ఆనాడు కమ్యూనిస్టులు త్యాగాలు చేశారని సీపీఐ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్‌ అన్నారు. అందుకే ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసేందుకు సీపీఐ సాయుధ పోరాట కళాజాత కార్యక్రమాన్ని చేపట్టినట్లు అన్నారు. తెలంగాణ అమరుల ఆశయాలను కొనసాగించేందుకు సీపీఐ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సీపీఐ చేపట్టిన సాయుధ పోరాట కళాజాత బృందం ఆదివారం పెద్దపల్లికి చేరింది. పాలకులు అణిచితకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేసిన 4500 మంది కమ్యూనిస్టు యువకులు అశువులు బాసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత తెలంగాణలో కూడా బడుగు, బలహీనవర్గాలపై అణచివేత కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలన్నారు.తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని సీపీఐ నేత ఆరోపించారు. నిజాం పాలన మురిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గ్దదె దించాలని ఆయన ధ్వజమెత్తారు. నిజాం నిరంకుశ పాటనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సీపీఐ భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటం నిర్వహించిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ప్రాణాలను కోల్పోయారని, దాని ఫలితంగానే తెలంగాణ, భారతదేశంలో విలీనమైందన్నారు. తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బస్సుయాత్ర చేపట్టామని, ప్రభుత్వ విధానాలను ప్రజలకు అవగాహన కలిగిస్తు యాత్రను సాగిస్తున్నామని తెలిపారు.