విశాఖలో ఐఐఎం… దేశ వ్యాప్తంగా ఆరు.. కేంద్రం ఆమోదం

  
 విశాఖపట్నంలో ఐఐఎం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఐఐఎంలో వచ్చే విద్యా సంవత్సం నుంచి కోర్సులు ప్రారంభమవుతాయి. తొలత 140 మంది విద్యార్థులతో ఆరంభమయ్యే ఈ సంస్థలు ఏడేళ్ళలో 560 మందికి చేరుకుంటాయి. దేశవ్యాప్తంగా ఆరు సంస్థలను నెలకొల్పేందుకు మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. 
దేశవ్యాప్తంగా ఐఐఎంలను (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేయటానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌), బోధ్‌గయ (బిహార్‌), సిర్మార్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర), సంబల్‌పూర్‌ (ఒడిశా), అమృత్‌సర్‌ (పంజాబ్‌)లలో కొత్త ఐఐఎంలు ఏర్పాటుకానున్నాయి. 
పీజీకోర్సుకు తొలుత 140 మంది విద్యార్థులను తీసుకుంటాయి. ఏడేళ్ల తర్వాత ఈ సంఖ్య 560కి చేరుకుంటుంది. బుధవారం సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గతంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా కొత్తగా ఐదు ఐఐఎంలను ఏర్పాటుచేయనున్నట్లుగా తెలిపారు. 

వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఐఐఎంను నెలకొల్పనున్నట్లుగా వెల్లడించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 ఐఐఎంలున్నాయి.