విశాఖ మెట్రో నిర్మాణం రేస్‌లో ఐదు సంస్థలు

– కేంద్ర మంత్రి హార్దీప్‌సింగ్‌పూరి
న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : విశాఖలో పీపీపీ విధానంలో మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టడానికి ఐదు సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం షార్ట్‌లిస్ట్‌ చేసిందని, వారికి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ను జారీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ (ఈవోఐ)ని ఆహ్వానించగా పలు సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన మేరకు ఆర్‌ఎఫ్‌పీలను జారీ చేయడానికి అయిదు సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారు. నగరం అభివృద్ధిలో రవాణా వ్యవస్థ ఒక అంతర్భాగమని, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మాత్రమే ఉంటుందని మంత్రి తెలిపారు. అందువలన మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే రూపొందిస్తాయని, అందువలన మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ అలైన్‌మెంట్‌ ఎలా ఉండాలి, మొత్తం ఎంత వ్యయం అవుతుందో ఏపీ ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం కోరుతున్నట్లయితే ఆ ప్రతిపాదనలు మెట్రో రైల్‌ విధానంలోని పలు అంశాలకు అనుగుణంగా ఉండి తీరాలని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా 2016లో షీలానగర్‌లో ఈఎస్‌ఐ హాస్పటల్‌కి ఏడు ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేసినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మరో ప్రశ్నను స్పందించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిని 300 నుంచి 500 పడకలకు పెంచడానికి అవసరమైన మరో రెండు ఎకరాల భూమిని ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని, అయితే ఈఎస్‌ఐ ఆస్పత్రి లేకపోవటంతో ప్రైవేటు ఆసుపత్రులకు కార్మికులు వెళ్లాల్సి వస్తోందని, తద్వారా అప్పులపాలవుతున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
————————–