విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్‌

పాకిస్తాన్‌ మార్చి 6 (జనంసాక్షి):

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. మొత్తం 178 ఓట్లను ఆయన సంపాదించుకున్నారు. విశ్వాస పరీక్షలో విజయం సాధిం చడానికి ఆయన 171 ఓట్లు అవసరం. కానీ 178 ఓట్లను సంపాదించు కొని సునాయాసంగా గండం గట్టెక్కారు. అయితే విపక్షాలు ఈ విశ్వాస పరీక్షను బాయ్‌కాట్‌ చేశాయి. దీంతో ఇమ్రాన్‌కు గెలవడం మరింత సుల ువైంది. ఇమ్రాన్‌ విజయం సాధించగానే ”ఇమ్రాన్‌ ఖాన్‌ జిందాబాద్‌… జిందాబాద్‌” అంటూ పార్లమెంట్‌లోనే నినాదాలు మార్మో గాయి.  అయితే రెబెల్స్‌ తనకు వ్యతిరేకంగా ఓటేస్తారన్న భయం ఆయ నకు ఉండేది. అలా ఎవరైనా చేస్తే.. వారిపై అనర్హత వేటు పడుతుందని ముందే హెచ్చరిం చారు. దీంతో ఆయన సునాయాసంగా విశ్వాస పరీక్షలో గెలిచారు.

ఆర్థిక మంత్రి ఓడిపోవడంతో….

కొన్ని రోజుల క్రితం జరిగిన సెనెట్‌ ఎన్నికల్లో ఆయన పార్టీ ‘పార్టీ తెహ్రీక్‌ -ఈ- ఇన్సాఫ్‌’ వెనకబడింది. ఆయన కేబినెట్‌లో ఆర్థిక మంత్రి ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఈ పరిస్థితి వచ్చి పడింది.  దీంతో ప్రతిపక్షాలు ఆయన్ను టార్గెట్‌ చేశాయి. గౌరవప్రదంగా ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చాయి. దీంతో పాక్‌ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ‘ఆయనకు నిజంగా ఆత్మాభిమానం ఉంటే వెంటనే ప్రధాని పదవి నుంచి వైదొలగాలి. ఈ డిమాండ్‌ కేవలం ప్రతిపక్షాల నుంచి మాత్రమే రావడం లేదు. అధికార పక్షం నుంచి కూడా వస్తోంది.” అని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. సెనేట్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌కు ఎదురు దెబ్బ తగలడంతో ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిందేనన్న డిమాండ్‌ వచ్చింది. దీనికి ఇమ్రాన్‌ సిద్ధపడి, శనివారం విశ్వాస పరీక్షకు సిద్ధపడిపోయారు. ఈ పరీక్షలో ఇమ్రాన్‌ పాస్‌ కావడంతో ప్రతిపక్షాలకు ముకుతాడు వేసినట్లేనని ఇమ్రాన్‌ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇమ్రాన్‌కు తిరుగుండదా?

కరోనాతో పాక్‌ చతికిలపడిపోయింది. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. పైగా ప్రపంచ  పటంపై ఏకాకిగా మారిపోయింది. చైనా పాక్‌ను దగ్గర తీసుకున్నా…. అవసరార్థం అని ఇమ్రాన్‌కు బాగా తెలుసు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఇమ్రాన్‌ను ఇరికించాలని ప్రతిపక్షాలు వ్యూహం రచించాయి. విశ్వాస పరీక్ష వరకూ రాజకీయాలు వెళ్లాయి. పైగా ఆర్మీ చీఫ్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. దీంతో ప్రధానికి పదవీ గండం అని అందరూ భావించారు. కానీ ఇమ్రాన్‌ చాకచక్యంగా వ్యవహరించి, రెబెల్స్‌ను కట్టడి చేసి విశ్వాస పరీక్షను సునాయాసంగా గట్టెక్కారు. దీంతో ప్రతిపక్షాలకు ముకుతాడు వేసినట్లైంది. సైన్యం కూడా తగు జాగ్రత్తలోనే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. దేశంలోని పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్న నేపథ్యంలో తమ చేతుల్లోకి తీసుకొని, సైనిక పాలన విధించాలన్న తలంపుతో ఆర్మీ ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇమ్రాన్‌ విశ్వాస పరీక్షలో విజయం సాధించడంతో ఆర్మీ కూడా తగు జాగ్రత్తతో వ్యవహరిస్తుందని ఇమ్రాన్‌ వర్గం పేర్కొంటోంది.