విష జ్వరాలతో.. 

వణికిపోతున్నఆదిలాబాద్‌ ఏజెన్సీ
– మంచాన పడుతున్న గిరిజనులు
– గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలకు విషజ్వరాలు
– ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేయని అధికారులు
– ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజన ప్రాంత వాసులు
అదిలాబాద్‌, జులై13(జ‌నం సాక్షి) : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతం మంచం పట్టింది. విష జ్వరాలు, వైరల్‌ ఫీవర్స్‌ తో జనం అవస్థలు పడుతున్నారు. జ్వరాలతో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోగా వందలాది మంది దవాఖానాల్లో చేరారు. వర్షకాలం మొదలు కావడం, కలుషిత నీరు, పరిసరాల అపరిశుభ్రత వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఏజెన్సీ పరిధిలో ఇప్పటికే పూర్తి కావాల్సిన రోగ నిర్దారణ సర్వే పూర్తికాకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం విష జ్వరాలతో వణుకుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలంలోని అత్నామ్‌ గూడాలో పదుల సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. ఇందులో వారంలోపే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆదిలాబాద్స్‌ రిమ్స్‌ దవాఖానాలో ఈ ఒక్క గ్రామానికి చెందిన వారే 16మంది చికిత్స పొందుతుండగా.. ఇంకా గ్రామంలో చాలా మంది జ్వరపీడితులు ఉన్నట్టు తెలుస్తోంది. కలుషిత నీరు తాగడమే జ్వరాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం. చిన్నపాటి జ్వరం వచ్చినా దవాఖానాలకు వెళ్లక బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆత్నామ్‌ గూడతో పాటుగా.. ఏజెన్సీ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం, అపరిశుభ్రత, పౌష్టికాహార లోపంతో అమాయక గిరిజనులు మంచాన పడుతున్నారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఎజెన్సీలో వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన వైద్య ఆరోగ్యశాఖ సమస్యలతో సతమతమవుతోంది. డాక్టర్లు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనికి తోడు సమస్యాత్మక గ్రామాలలో దోమల వ్యాప్తిని అరికట్టడం, మలేరియా వ్యాధి నివారణ, పారిశుద్ధ్యం, కలుషిత నీటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. అయితే సమస్య వచ్చినప్పుడు మాత్రమే అక్కడికెల్లి చర్యలు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనికితోడు ఆదివాసీల్లో ఉన్న మూఢనమ్మకాలతో కూడా మరణాల సంఖ్య పెరుగుతోందంటున్నారు వైద్యులు.
పౌష్టికాహారలోపంతో గిరిజనులు అనారోగ్యం భారిన పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం 1985లో ఉట్నూరు ఐటీడీఏ ఆధీనంలో ప్రత్యేక ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖను ఏర్పాటు చేసింది. అదనపు జిల్లా వైద్యశాఖాధికారి పర్యవేక్షణలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 31ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 186 ఉపకేంద్రాలను ప్రారంభించారు. వీటి పరిధిలోకి వచ్చే సుమారు ఏడు లక్షల మందికి వైద్యసేవలు అందించడమే వీటి ప్రధాన లక్ష్యం. అయితే ఆశయం బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం అంతంతే మాత్రంగానే ఉంది పరిస్థితి. వైద్య ఆరోగ్యశాఖలో చాలా వరకు పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. జిల్లా పంచాయతీ, గ్రావిూణ నీటి సరఫరా విభాగం, మహిళా శిశుసంక్షేమశాఖ, రెవెన్యూ, ఐటీడీఏ అధికారుల సమన్వయంతో వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. ఆ దిశగా అడుగులు పడడం లేదంటున్నారు గిరిజనులు. ఏజెన్సీలో తాగునీటి సరఫరాను మెరుగు పరిచి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. జ్వరపీడిత గ్రామాలలో మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలంటున్నారు.