విూ అందరి దీవెనలతో..  యుద్ధానికి బయల్దేరుతున్నా

– 100 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటాం
– కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు నాకున్నాయి
– తెలంగాణ ఉద్యమానికి కూడా ఇక్కడి నుంచే బయల్దేరా
– వచ్చే ఏడాది కాళేశ్వరం నీటితో దేవుడి పాదాలను కడుగుదాం
– ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌
– కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన కేసీఆర్‌, హరీష్‌రావు
సిద్ధిపేట, నవంబర్‌14(జ‌నంసాక్షి) : విూ అందరి దీవెనలతో యుద్ధానికి బయల్దేరుతున్నానని, 100 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవటం ఖాయమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం కేసీఆర్‌ సిద్ధిపేట జిల్లా నంగనూరు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి గుడిలో హరీష్‌రావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథంపై నుంచి ఆయన మాట్లాడారు.. విూ అందరి దీవెనలతో యుద్ధానికి బయల్దేరుతున్నానని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించానని, స్వామి ఆశీస్సులు తనకు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ పూజలు చేసే తెలంగాణ ఉద్యమానికి బయల్దేరానని చెప్పారు. ప్రతి రాజకీయ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించానని తెలిపారు. రైతులను అప్పులేని తెలంగాణెళి బంగారు తెలంగాణ అని అన్నారు. వచ్చే ఏడాది కాళేశ్వరం నీటితో దేవుడి పాదాలను కడుగుదామని కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో 24 గంటలు విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. స్వామి ఆశీస్సులతో అన్నింటిలోనూ విజయం సాధించానని… రానున్న ఎన్నికల్లో 100 సీట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నామని కేసీఆర్‌ తెలిపారు. ఎవరూ నమ్మని రీతిలో సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే క్రమంలో ప్రజలకు దూరమయ్యానన్న బాధ తనలో ఉందని అన్నారు. దేశంలోనే ధనిక రైతులకు తెలంగాణ వేదికగా మారాలని ఆకాంక్షించారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు ఇక్కడే ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు. సిద్ధిపేటలో హరీష్‌ రావును ఆశీర్వదించి లక్ష మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్‌ ఓటర్లను కోరారు. అనంతరం నామినేషన్‌ వేయడానికి ఆయన కోనాయిపల్లి నుంచి బయల్దేరారు.
ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేసే ముందు కోనాయిపల్లి వెంకన్నను కేసీఆర్‌ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్‌.. నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచారు. ఆయనతో పాటు మంత్రి హరీశ్‌రావు వెంకన్నను దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు పోయాయని, రైతులకు సరిపోయినంతగా కరెంట్‌ ఇస్తున్నామన్నారు. వెంకన్న దయవల్ల వచ్చే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని, ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారి పాదాలు కడుగుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. తాను
ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా.. తన మూలాలు ఇక్కడే ఉంటాయన్నారు.