వీడని బొగ్గు మసి

5

– కేసులు నమోదు చేయండి

– సీబీఐ కోర్టు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 29(జనంసాక్షి):బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణరావుకు ఉచ్చు బిగుస్తుంది. దాసరిపై చార్జ్‌షీట్‌ నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన గతంలో బొగ్గుశాఖ సహాయమంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలు జరిగినట్లు తేలింది. దీనిపై తన ప్రమేయం లేదని, దీనికి ఆనాటి ప్రధాని మన్మోహన్‌ బాధ్యుడని దాసరి అప్పట్లో తప్పుకునే ప్రయత్నంల చేశారు. దీంతో బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి,ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావుకు చిక్కులు తప్పేలా లేవు.  జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, కాంగ్రెస్‌ ఎమ్‌.పి నవీన్‌ జిందాల్‌, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావులపై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు సిబిఐకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కేసులో తనకు సంబందం లేదని, అంతా ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ దే బాద్యత అని ,తాను సహాయ మంత్రినేనని దాసరి అప్పట్లో కోర్టులో వాదించారు. అయినప్పటికీ కోర్టు మిగిలినవారితో సహా దాసరిపై కూడా చార్జిషీట్‌ నమోదు చేయడానికి సిబిఐకి అనుమతి ఇచ్చింది.బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కాగ్‌ వెల్లడించిన నేపథ్యంలో ఈ కేసు పై సిబిఐ విచారణ చేసింది. దాసరి సహా జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, మరో నిందితుడు నవీన్‌ జిందాల్‌పై ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాలని ఆదేశించింది. అమరకొండా మురుగదంగల్‌ బొగ్గు క్షేత్రం కేటాయింపు వ్యవహారంలో దాసరితో పాటు నవీన్‌ జిందాల్‌ పై ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. ఇతర బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై ఇటీవల సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఆర్‌ఎస్‌ రుంగ్తా, ఆర్‌సీ రుంగ్తాలను న్యాయస్థానం దోషులుగా ప్రకటించింది. ఆర్‌ఎస్‌ రుంగ్తా, ఆర్‌సీ రుంగ్తా ఇస్సాత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. నకిలీ ధృవపత్రాలు సమర్పించి బొగ్గు గనులు దక్కించుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. నేరపూరిత కుట్ర, మోసానికి పాల్పడినట్లు తీర్పులో కోర్టు పేర్కొంది. ఆర్‌ఎస్‌ రుంగ్తా, ఆర్‌సీ రుంగ్తాలను కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. గత ఏడాది మార్చి 21న వివిధ సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. ఆర్‌ఎస్‌ రుంగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా కేంద్ర మాజీ మంత్రి దాసరికి సమన్లు ఇవ్వాలని ఆర్‌ఎస్‌ రుంగ్తా వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.