వృద్ధిమాన్‌కు మాంచెస్టర్‌లో సర్జరీ

– వెల్లడించిన బీసీసీ
ముంబయి, జులై21(జ‌నం సాక్షి) : తీవ్రమైన భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న భారత టెస్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహాకు ఇంగ్లాండ్‌లో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం వెల్లడించింది. ఈ నెలాఖరులోగాని, ఆగస్టు మొదటివారంలోగాని మాంచెస్టర్‌లో అతనికి చికిత్స అందించనున్నట్లు బీసీసీసీ వెబ్‌సైట్లో పేర్కొంది. అతనితో పాటు తన భార్య కూడా వెళ్లనున్నారని తెలిపింది. ఆమె వీసా దరఖాస్తును బోర్డు పంపించిందని, ఆ పక్రియ జరుగుతోందని వీలైనంత తొందరగా సాహాను ఇంగ్లాండ్‌కు పంపించేందుకు బోర్డు ప్రయత్నిస్తోందని వెల్లడించింది.
గాయం నుంచి కోలుకోవడానికి సర్జరీ తప్పనిసరి అతనికి చెప్పామని, చికిత్స కోసం ముంబయి, మాంచెస్టర్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలని కోరగా అతడు మాంచెస్టర్‌ను ఎంపిక చేశాడన్నారు. మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చి ఆడేందుకు అతనికి కనీసం 6 నుంచి 8నెలల సమయం పట్టవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా పర్యటనలో సాహా క్యాచ్‌ అందుకునే ప్రయత్నంలో అతని భుజానికి దెబ్బతగిలింది. అయితే అప్పడు దాని తీవ్రత అంతగాలేదు. తాజాగా అది తిరగబెట్టడంతో శస్త్రచికిత్స అనివార్యమైంది.