వెంకటరమణ హత్య కేసులో లొంగిన నిందితులు

కడప,మే4(జ‌నంసాక్షి):  మైదుకూరు బ్రహ్మంగారి మఠం మండలంలో మార్చి 26 వ తేదీన జరిగిన వెంకట రమణ హత్య కేసులో ముద్దాయిలను శనివారం మైదుకూరు డిఎస్‌పి కార్యాలయంలో అరెస్టు చేశారు. స్థానిక డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డిఎస్‌పి బిఆర్‌.శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు. ముక్కామల లక్ష్మీ నరసింహ రెడ్డి, మురుగయ్య, వెంకటరమణలు కొంతకాలంగా
స్నేహంగా ఉంటూ అప్పుడప్పుడు కలిసి మద్యం సేవించే వారని, మార్చి 26 వ తేదీ రాత్రి ముగ్గురు కలిసి మద్యం సేవించారని తెలిపారు. అనంతరం హత్య కాబడ్డ వ్యక్తి వెంకట రమణ తనను బైక్‌ పై ఇంటి వద్ద విడిచిపెట్టాలని కోరగా, అందుకు లక్ష్మీ నరసింహ రెడ్డి తిరస్కరించడంతో.. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని తెలిపారు. తాగిన మైకంలో నరసింహా రెడ్డి వెంకట రమణను కొట్టగా వెంకట రమణ స్పృహ కోల్పోవడంతో చనిపోయాడనుకొని, వెంకట రమణను సంచిలో తీసుకెళ్లి తెలుగు గంగా ఎడమ కాలువ వైపు ఈశ్వరమ్మ గుడికి వెళ్ళే దారిలో, బ్రిడ్జి వద్ద పెట్రోల్‌ తో శవాన్ని నిప్పంటించి కాల్చేశారని వివరించారు. అనంతరం నరసింహారెడ్డి, మురుగయ్యలు గోవాకు వెళ్లి తిరిగి వచ్చారని, పోలీసులు విచారణ చేస్తున్నారన్న భయంతో ముద్దాయిలు తమంతట తామే పోలీసు స్టేషన్‌కు వచ్చి నేరాన్ని అంగీకరించి లొంగిపోయారని తెలిపారు. వీరిద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుండి మోటార్‌ సైకిల్‌ను, రాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌ పంపించామని డిఎస్‌పి వివరించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు రూరల్‌ సిఐ కంబగిరి రాముడు, బ్రహ్మంగారి మఠం ఎస్‌ఐ రాజగోపాల్‌, పోలీసులు పాల్గొన్నారు.