వెనకడుగు ముచ్చటే లేదు

సాగు చట్టాల రద్దు చేసే వరకు కదిలేది లేదు

సర్కార్‌ మెట్టు దిగిన నమ్మని రైతులు

ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించి తీరుతాం రైతు సంఘాలు

దిల్లీ  జనవరి 21 (జనం సాక్షి):   నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను ముక్తకంఠంతో తిరస్కరించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం రైతు సంఘాల ప్రతినిధులు చర్చించుకున్న అనంతరం సంయుక్త కిసాన్‌ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది.నూతన చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి బుధవారం విజ్ఞాన్‌భవన ్‌లో ఉభయ పక్షాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలను ఒకటిన్నరేళ్ల పాటు నిలుపుదల చేస్తామని కేంద్ర సర్కారు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. వీటి అమలును స్తంభింపజేసి, ఒక సంయుక్త సంఘాన్ని నియమించడానికి ముందుకొచ్చింది. దీనిపై ఇవాళ తాము అంతర్గతంగా చర్చించుకుని తుది నిర్ణయం చెబుతామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో సమావేశమైన రైతు సంఘాల నేతలు తాజా నిర్ణయాన్ని ప్రకటించారు. తదుపరి విడత చర్చలు ఈ నెల 22న జరగనున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే సంప్రదింపులను ప్రారంభించింది. ఇంకోవైపు గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్‌ పరేడ్‌కు రైతులు సిద్ధమవుతున్నారు.