వేగంగా వెళితే ప్రమాదమే కాదు..చలానా కూడా

లేజర్‌ గన్స్‌తో ఖమ్మంలో నజర్‌
ఖమ్మం,నవంబర్‌8 (జనం సాక్షి) : వాహనాల్లో రయ్యిమంటూ దూసుకెళ్లే వారికి ఇక నుంచి ఖమ్మంలోనూ జరిమానాలు విధిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్పీడ్‌ లేజర్‌గన్స్‌ను ట్రాఫిక్‌ పోలీసులు తీసుకువచ్చారు. గతంలో ఖమ్మంలో హెల్మట్‌, త్రిబుల్‌రైడింగ్‌, లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్‌ వంటి అంశాలపై కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు అతివేగంగా వెళ్లేవారికి జరిమానాలు విధించనున్నారు.
వేగంగా వెళ్లేవారిని ఎవరికీ కనపడకుండా రోడ్లపక్కన ఉండి లేజర్‌గన్‌తో క్యాప్చర్‌ చేస్తారు. ఇది దాదాపు 500 విూటర్ల దూరం పని చేస్తుంది. ఖమ్మం నగర పరిధిలో 40స్పీడ్‌తో మాత్రమే వెళ్లాలి.. కానీ 40స్పీడ్‌ దాటి వెళుతున్నారు. అలాకాకుండా 40 దాటి 45వరకు వెళ్లినా రూ.1000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. బైపాస్‌రోడ్డు పక్కన కాలేజీలు, స్కూల్స్‌ ఉండడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు 40 స్పీడ్‌తో వెళ్లాలని పలు ప్రాంతాలలో స్పీడ్‌ లిమిట్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. లేజర్‌గన్‌ ద్వారా స్పీడ్‌గా వెళుతున్న వాహనాన్ని నెంబరు క్యాప్చర్‌ చేస్తారు. ఆ వాహన వివరాలు వెంటనే ట్రాఫిక్‌ పోలీసుల సర్వర్‌కు వెళతాయి. దీంతో వెంటనే చలానా జనరట్‌ అవుతుంది. వాహనదారులకు వెంటనే మెసేజ్‌ కూడా వస్తుంది. అతివేగాన్ని అరికట్టందుకు బాధ్యతలో భాగంగా స్పీడ్‌లేజర్‌గన్‌ ఆపరేట్‌ చేసేందుకు ఖమ్మంలో నలుగురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు.  మొదటిసారిగా ఖమ్మంతోపాటు మిగతా అన్నిజిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకు ఖమ్మంలో ముందుగా ఒక లేజర్‌ గన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఇంకా స్పీడ్‌గన్నులు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ రకంగావాహనాల వేగ నియంత్రణకు అధికారులు నడుం బిగించారు. అతివేగం
కారణంగా ప్రమాదలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పోలీసులు కొత్తగా చలానాలతో పని చెప్పేందుకు సిద్ధమయ్యారు.