వేడుకగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

గ్రామాల్లో వెల్లివిరిసిన దసరా సందడి
హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): విజయానికి ప్రతీక అయిన పండుగ విజయదశమిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శక్తి స్వరూపిణి ఐన అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఆలయాల్లో  ఉదయం నుంచే మంత్రోచ్ఛారణలతో మారుమ్రోగాయి. వివిధ రూపాల్లో కొలువుదీరిన ఆదిశక్తికి అత్యంత నిష్ఠతో పూజలు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఇవాళ వేద పండితులు సరస్వతి యాగం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం అమ్మవారు నెమలి రథంలో ఆసీనులై.. ఆలయ మాఢ వీధుల్లో శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పండితులు మహా నివేదన మంగళహారతితో దసరా ఉత్సవాలను ముగించారు. వరంగల్‌ మహానగరంలోని భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయ దశమి ఐన తొమ్మిదవ రోజున భద్రకాళి అమ్మవారు.. భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. అలాగే ఉదయం నిత్యాహ్నీకం, సిద్ధి దాత్రీ దుర్గార్చన, ప్రత్యేక పూజలు.. సాయంత్రం జలక్రీడోత్సవం, హంసవాహన తెప్పోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు  భారీగా తరలి వచ్చారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దసరా మ¬త్సవాలు కన్నులపండువగా జరుగు తున్నాయి. 9వ రోజున శ్రీలక్ష్మీ తాయారు కోవెలలో అమ్మవారు నిజరూప మహాలక్ష్మీ అలంకారంలో దర్శమిచ్చారు. అంతకుముందు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. నిజరూప మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తీర్థప్రసాదాలు అందుకుని అమ్మవారి ఆశీర్వచనాలు పొందారు. విజయదశమి సందర్భంగా హైదరాబాద్‌ లోని పలు ఆలయాల్లో భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ప్రజలు దసరా వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అలాయ్‌- బలాయ్‌ తో జమ్మి ఆకులను పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్రప్రజలంతా భక్తిశ్రద్ధలతో దసరా పండుగను జరుపుకున్నారు. అమ్మవారికి అత్యంత నిష్ఠతో పూజలు నిర్వహించారు. వాహన, ఆయుధ పూజలు చేశారు. మధ్యాహ్నం  జమ్మిచెట్టుకు పూజలు చేశారు. పాలపిట్టను దర్శించుకుని, ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.