వేములవాడలో భక్తుల రద్దీ

లఘుదర్శనం ఏర్పాట్లు చేసిన అధికారులు
వేములవాడ,మే21(జ‌నం సాక్షి):తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది.  వేసవి సెలవులకు తోడు సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది.  ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకదాశం రుద్రాభిషేకం నిర్వహించారు. హర హర..మహదేవో…శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయం మారు మోగుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో గర్భగుడి దర్శనం నిలిపివేసి లఘు దర్శనం అమలు చేస్తున్నారు. ఆలయంలోని కల్యాణ కట్టలో భక్తులు శ్రీ స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు అచరించి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా శ్రీ స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెలను సమర్పించి కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకుంటున్నారు. రాజన్నను దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంతో పాటు, అంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేసవి కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అవరణలో ప్రత్యేకంగా చలువ పందిళ్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే మంచినీటిని అందుబాటులో ఉంచారు. ఆలయంలో త్వరగా దర్శనం ముగించుకునేలా ఇవో రాజేశ్వర్‌ ఏర్పాట్లు చేశారు.