వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ,మార్చి11(జ‌నంసాక్షి): వేములవాడలో సోమవారం భక్తులు పోటెత్తారు. దీనికితోడు వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండం లో స్నానాలు ఆచరించి, తలనీలాలను సమర్పించిన భక్తులు కోడెమొక్కులను తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. గండదీపం, కల్యాణ మొక్కులు, సత్యనారాయణవ్రతాలు, పల్లకీసేవలు, పెద్దసేవలు తదితర మొక్కులను చెల్లించుకున్నారు. కల్యాణ మొక్కులను తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించుకునే పలు ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. లఘు దర్శనం మాత్రమే కల్పించారు. రాజన్నను ఆదివారం దాదాపు 12వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. సోమవారం దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఏర్పాట్లు చేపట్టారు.