వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి


నిజామాబాద్‌లో ఇద్దరు టెక్కీల మృత్యువాత
మెదక్‌ ప్రమాదంలో ఇద్దరు మృతి
సంగారెడ్డిలో ఓ యువకుడు మరణం
హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వేర్వేరు ప్రనమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. నిజామాబాద్‌లో ఇద్దరు, మెదక్‌లో ఇద్దరు,సంగారెడ్డిలో ఒకరు మృతి చెందారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు టెక్కీలు ఉన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేనూరు గ్రామం సవిూపంలో పెట్రోల్‌బంక్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం లారీ కారు ఢీకొని ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న గచ్చిబౌలికి చెందిన లక్ష్మీ నారాయణ(32), బిహార్‌కు చెందిన రాజన్‌(26), విజయ్‌కుమార్‌, కోమల్‌ సింగ్‌ కారులో షిర్డీ వెళ్లి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. మద్నూరు సవిూపంలో వీరి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ, రాజన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. విజయ్‌, కోమల్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృత దేహాలను శవపంచనామ నిమిత్తం మద్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  నిజామాబాద్‌ జిల్లా మద్దూరు దగ్గర హైవేపై సోమవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరు షిర్డీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోప్రమాదంలో మెదక్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందిన జగదీశ్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన అభిషేక్‌లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇకపోతే ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ యువకుడి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలంలోని లక్డారం గ్రామానికి చెందిన కర్నెవేణు (18) స్థానికంగా ఉన్న ఓ కళాశాల ఇంటర్‌ పూర్తి చేశాడు. తన స్నేహితుడైన ముచర్ల రాజుతో కలిసి లక్డారం నుంచి గోమారంవైపు ద్విచక్రవాహంపై వెళుతున్నాడు. అదే దారిలో ఇస్మాయిల్‌ఖాన్‌పేట నుంచి బ్యాతోల్‌వైపు వెళుతున్న పత్తి వెంకటేశం తన ద్విచక్రవాహనంతో ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వాహనం నడుపుతున్న కర్నెవేణు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృత చెందాడు. వెనాకల ఉన్న ముచ్చర్ల రాజుకు గాయాలు కావడంతో స్థానిక ఓ ప్రైవెట్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.