వేసవిలో ఉపాధి పనులు పెంచాలి


మరిన్ని పనుల కోసం కూలీల డిమాండ్‌
నిజామాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి): ఈ వేసవిలో ఉపాధి పనులు పెంచాలని చూస్తున్నందున గ్రామాల్లో వివిధ పనులను వీరికి అప్పగించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. వేసవిలో చెరువుల పూడికతీత మొదలు, కాలువగట్టు పనులు తదితర పనులు కల్పిస్తే మంచిదని అంటున్నారు. గ్రామాల్లో చేపట్టే ప్రభుత్వ పనుల్లో, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనుల్లో కూడా ఉపాధి కూలీలను జోడించాలన్నారు. అలా చేస్తే కూలీలకు పనులు దొరకడమే గాకుండా,పనులు కూడా సాఫీగా పూర్తవుతాయన్నారు. దీంతో పంచాయతీలు బలోపేతం కావడంతోపాటు వాటికి ఆర్థిక భారం కూడా తప్పుతుంది. కొత్తగా ఉపాధి కూలీలను పారిశుద్ధ్య పనుల్లోకి తీసుకునే ముందు వారు అన్ని పనులు చేసేలా జాబ్‌కార్డులు ఇవ్వాలన్నారు. కేంద్రం, రాస్టం సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు.  ఉపాధి హావిూ పనుల్ని విస్తృతం చేయాలని, అందులో భాగంగా పంచాయతీల్లో ఆయా పనులను ఉపాధి కూలీలతో నిర్వహించాలని అన్నారు. ఇలాచేస్తే  అటు కూలీలకు పని దొరకడంతో పాటు ఉపాధి దక్కే మార్గాలకు అవకాశం ఉంది. గ్రామాల పరిధిలో కూలీలకు ఏం పని చూపించాలని భావిస్తున్న ఉపాధి సిబ్బందికి అధికారుల నిర్ణయం ఊరటనిస్తోంది. కూలీలకు ప్లలెల్లోనే పనులు చూపించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత,
భూములు చదును చేయడం, నీటి తొట్లు, పొలాల్లో కుంటలు, చెక్‌డ్యాంల నిర్మాణం తదితర పనుల ద్వారా
ఉపాధి కూలీలకు వంద రోజుల పనులు కల్పించ వచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి హావిూ పథకంలో పారిశుద్ధ్య పనులు చేయించాలనే ఆలోచన మంచి నిర్ణయమని సర్పంచులు సైతం అంగీకరిస్తున్నారు.  ఉపాధి కూలీలతో పారిశుద్ధ్య పనులు చేయిస్తే ఇటు కూలీలకు పనులు దొరకడంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.  గ్రామ పంచాయతీల్లో ఇదివరకే డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనులను ఉపాధి కూలీలతో చేపడుతున్నారు. పంచాయతీ పారిశుద్ధ్య పనులనూ పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకోవడంతో కూలీలకు వంద రోజులు సమృద్ధిగా పనులు కల్పించవచ్చని ఉపాధి సిబ్బంది చెబుతున్నారు. ఇంతకాలం వంద రోజుల పనులు చేపట్టని కూలీలకు ఏవిధంగా పని చూపించాలనే ఆలోచిస్తున్న ఉపాధి సిబ్బందికి అధికారుల నిర్ణయం ఊరటనిస్తోంది.