వైకాపాలో చేరిన మోహన్‌బాబు

– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వై.ఎస్‌. జగన్‌
– జగన్‌ సీఎం అయితేనే రాష్ట్ర బాగుపడుతుంది
– తెలంగాణ ప్రభుత్వం ఎవరివిూదా దాడులు చేయడంలేదు
– కొందరు కావాలని దుష్పచ్రారం చేస్తున్నారు
– విలేకరులతో మంచు మోహన్‌బాబు
హైదరాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి) : సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు వైకాపాలో చేరారు. లోటస్‌పాండ్‌లో ఆ పార్టీ అధినేత జగన్‌ను ఆయన మంగళవారం ఉదయం కలిశారు. జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. మోహన్‌బాబు వెంట కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మీలుఉన్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు విలేకరులతో మాట్లాడారు..  వైఎస్‌ జగన్‌ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌పై అభిమానంతో టీడీపీలో చేరానని, తర్వాత ఇప్పుడు వైసీపీలో చేరారని తెలిపారు. పదవులు ఆశించి తాను పార్టీలో చేరలేదన్నారు. జగన్‌ ప్రజలకు మంచి చేసే వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. మూడేళ్ల క్రితమే జగన్‌ నన్ను పార్టీలోకి ఆహ్వానించాడని, నాకు పదవులపై ఆశలేదని, జగన్‌ సీఎం అయితే చూడాలని ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం నేను చేసిన ఆందోళనను చంద్రబాబు వర్గం రాజకీయం చేసిందని, మా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేయాలని మూడు సంవత్సరాల నుంచి చంద్రబాబుకు ఎన్నోసార్లు ఫోన్‌ చేశానని అన్నారు. అన్ని వివరాలతో లేఖరాసి నా కజిన్‌తో పంపించానని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటివరకూ మా విద్యాసంస్థకు రూ.19 కోట్ల బకాయిలు రావాలని, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ అనుకున్న సమయానికి ఇవ్వాలని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మూడు నెలలకోసారి ఇస్తానన్నారని అన్నారు. కానీ సక్రమంగా ఇవ్వలేకపోయారని, దీని ప్రభావం వల్ల కొన్ని కాలేజీల్లో జీతాలివ్వలేకపోవచ్చునని, కానీ నేను మాత్రం సొంత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ జీతాలిచ్చానన్నారు. నా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కూడా కదిలించానని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనప్పుడు విూరు సహరించాలని తల్లిదండ్రులను పిలిచి చెప్పాననని మోహన్‌బాబు తెలిపారు. మాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ బాకీ లేదని, సక్రమంగానే ఉప్పల్‌లో విద్యా సంస్థ నడుపుతున్నామని, పంచభూతాల సాక్షిగా చెప్తున్నానని, ఇవి నేను భయపడి చేస్తున్న వ్యాఖ్యలు కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి విూదా దాడులు చేయలేదని, చేయదని మోహన్‌బాబు పేర్కొన్నారు. చంద్రబాబును నేను కావాలని ఏకవచనంతో పిలవలేదని,  ఆయనతో ఉన్న బంధుత్వం, స్నేహం కారణంతో అలా పిలిచానన్నారు. మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తా అన్నావ్‌ .. ఏదీ..  ప్రభుత్వం నా ఒక్క కాలేజీకే కాదు.. చాలా విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదని మోహన్‌బాబు అన్నారు. నేను ధైర్యంగా బయటికి వచ్చానని, చాలామంది తమ బొక్కలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో నోరు మెదపడం లేదని మోహన్‌బాబు అన్నారు. నాకురాజకీయాల్లో చేరాలని, పదవులు అనుభవించాలని రాజకీయాల్లోకి రాలేదని, జగన్‌ ప్రజలకు మంచి చేస్తాడన్న నమ్మకంతోనే ఇప్పుడు వైసీపీలో చేరానని మోహన్‌బాబు స్పష్టం చేశారు. ఈ పార్టీలో చేరడానికి ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదని, పదవులే కావాలంటే ఎప్పుడో దక్కేవని మోహన్‌బాబు అన్నారు.