వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం: మంత్రి హరీశ్‌ రావు

సంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వ దావాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే ధ్యేయంతో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఈ మేరకు పిహెచ్‌సి స్థాయిలో ఆధునీకరిస్తున్నామని అన్నారు. అనేక ఆస్పత్రులను అభివృద్ది చేశామని అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌ పట్టణంలో రూ. 11.5 కోట్ల నిధులతో నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు, అదే విధంగా బాడంపేట గ్రామ సవిూపంలో రూ. 2.05 కోట్లతో నిర్మించనున్న విద్యుత్‌ ఉపకేంద్ర నిర్మాణ పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. కోహిర్‌ పట్టణంలో ఎంఎస్‌డీపీ నిధులు రూ.40 లక్షలతో నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాలలో ఆరు అదనపు గదులు, బాలుర ఉన్నత పాఠశాలలో రూ.21.40 లక్షలతో నిర్మించిన నాలుగు గదులను ఆయన ప్రారంభించారు. పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.