వైద్య వాహనాలకు రిపేర్ల సమస్య

గిరి ప్రాంతాల రోగులకు కష్టకాలం
భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  గ్రావిూణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు, గర్భిణులు వైద్యం కోసం వ్యయప్రయాసలు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోక పోవటంతో చాలామందికి జీవన్మరణ సమస్యగా మారింది. దీంతో  ప్రజల చెంతకు వైద్య సేవలు వెళ్లట్లేదు. చిన్నచిన్న సమస్యలతో జిల్లాలో 104 సేవలు నిలిచిపోతున్నాయి. సర్వీసింగ్‌ లేకపోవడంతో  వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.  వైద్యసేవలందించడానికి సిబ్బంది బయలుదేరినప్పటికీ ఎక్కడ  ఆగిపోతాయో అర్థంకాని పరిస్థితి ఉండేది. నిబంధనల ప్రకారం వాహనాలు 30 వేల కిలోవిూటర్లు తిరిగితే మరమ్మతులు చేయాల్సి ఉంది. వాహన సిబ్బంది ఉత్తర్వులు నకలు తీసుకొని వెళ్తే.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల్లేవని మరమ్మతులు చేయటానికి నిరాకరిస్తున్నారు.  దీంతో రోజురోజుకు సమస్యలు పెరిగి పూర్తిగా మూలకు చేరాయి. పదుల సంఖ్యల్లో వాహనాలు చిన్న చిన్న మరమ్మతులతో ఆస్పత్రుల్లో ఉన్నాయి. స్టార్ట్‌ కాకపోవడం, రేడియేటర్‌ లీకవ్వడం, కొన్ని భాగాలు తుప్పుపట్టడం.. తదితర ఇబ్బందులు మొదలయ్యాయి.  వాహనాలకు ప్రమాద బీమా సౌకర్యం లేకపోవడంతో  సిబ్బంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు.