వైసీపీలో చేరడంలో కేసీఆర్‌ ప్రమేయం

– పార్టీని వీడేవారిని పట్టించుకోవద్దు
– తెదేపా సంక్షేమ పథకాలతో జగన్‌కు మతిపోతుంది
– హైదరాబాద్‌లో కూర్చొని కేసీఆర్‌తో కలిసి కుట్రలు చేస్తున్నాడు
– మూడు పార్టీల కుట్రలు నెరవేరితే రాష్ట్రానికి నీళ్లు రావు
– దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించం
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : టీడీపీ నుంచి పలువురు నేతలు వైసీపీలో చేరడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రమేయం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు.. వైసీపీలో చేరాలని హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న నేతలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య పెడుతున్నారని.. అలా పోయే వారిని పట్టించుకోవద్దని నేతలకు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే అని తేల్చిచెప్పారు. పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి అన్నదాత సుఖీభవ వేడుకలు నిర్వహించాలని నేతలను సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాలతో జగన్‌కు ఫ్రస్టేషన్‌ పెరిగిందని విమర్శించారు. హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్‌తో కలిసి జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరంపై కేసులు వేసినవాళ్లతో వైసీపీ లాలూచీపడిందన్నారు. మూడు పార్టీల కుట్రలు నెరవేరితే రాష్ట్రానికి నీళ్లు రావని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించం..
ఎన్నికలకు ముందు కావాలనే దాడి చేయించారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు. దేశ భద్రత కోసం ఐక్యంగా పోరాడేందుకు వెనుకాడబోమని అన్నారు. సైనికులకే తమ మద్దతు ఉంటుందన్నారు. కానీ ప్రధాని మోదీ ఏమైనా చేయగల సమర్థుడని, గోద్రాలో నరమేధాన్ని మరువమని విమర్శించారు. దేశ భక్తిలో, భద్రతలో తెదేపా రాజీపడదని స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరమని సీఎం తెలిపారు. ఆ ప్రదేశాల్లో రాజకీయ లబ్ధిని చూడరాదని.. భాజపా రాజకీయాలతోనే జమ్ముకశ్మీర్‌లో సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు.