వ్యక్తిగత మరుగదొడ్ల లక్ష్యాన్నిచేరుకోవాలి

ప్రతి మండలంలో టార్గెట్‌ రీచ్‌ కావాలి

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌21 (జనం సాక్షి)  : జిల్లాలో వ్యక్తిగత మరుగదొడ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసి వందశాతం ఓడిఎఫ్‌ జిల్లాగా ప్రకటించుకునేందుకు కృషి చేయాలని కెలెక్టర్‌ అన్నారు.నిర్మాణాల అంశాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి తనిఖీలు చేపట్టాలని దేశించారు. మరుగుదొడ్డి నిర్మాణానికి ముగ్గు పోసి ఫొటో అప్‌లోడ్‌ చేయడంతోపాటు మొదటి ఎఫ్‌టీవో జనరేట్‌ చేయడం వల్ల నిధులు మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. తద్వారా పెద్ద ఎత్తున మార్కింగ్‌ చేసి ఫొటోలు అప్‌లోడ్‌ చేసి ఎఫ్‌టీవో జనరేట్‌ చేయాలని సూచించారు. లేకపోతే నిధుల మంజూరులో ఆలస్యం జరుగుతోందన్నారు. ప్రతి మండలంలోనూ నెలకు వెయ్యి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నిర్మాణాలను రాళ్ళతో బేస్‌మెంట్‌ వేయాలని, సిమెంట్‌ ఇటుకలతో బేస్‌మెంట్‌ వేయడం వల్ల దీర్ఘకాలం మన్నికలో ఉండటానికి అవకాశం లేదని, అలా నిర్మించినవాటికి నిధులు మంజూరు చేసేందుకు అవకాశం లేనది తేల్చిచెప్పారు. అటవీ భూములకు సంబంధించి జారీ చేసిన అసైన్మెంట్‌ వివరాలను మండలాల వారీగా ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఇటీవల కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వ భూములకు సంబంధించి అటవీ సమస్యలు ఏర్పడితే సంబంధిత శాఖాధికారుల ద్వారా సంయుక్త పరిశీలన నిర్వహించి ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వ్యవసాయేతర భూములకు సంబంధించి సమస్యలుంటే క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవసాయేతర భూముల నివేదికల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని, వాటిని పునఃపరిశీలన చేసుకోవాలన్నారు.

చెరువు శిఖం భూములు వ్యవసాయేతర భూములు పరిశీలించాలన్నారు. రైతులకు వ్యవసాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి ద్వారా నిధులు విడుదల చేసేందుకు 1-బీ అవసరం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు పరిశీలించి భూముల నివేదికలు తయారు చేసిన వివరాలను గ్రామస్థాయిలో ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపజేసి ఫొటోలను తీయించాలని సూచించారు. రికార్డులు ప్రక్షాళన తీరును పరిశీలించేందుకు అధికారుల బృందం పర్యటించే అవకాశం ఉన్నందున, క్షేత్రస్థాయిలో వివరాలు వీఆర్వోలు కూలంకశంగా వివరించే విధంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.