వ్యతిరేక పవనాలను గుర్తించని బిజెపి 

శనివారం 3-11-2018

జిఎస్టీ,పెట్రో ధరలు, రఫేల్‌ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా జిఎస్టీ ప్రభావం బాగానే కనిపించింది. ఇప్పుడు మరోమారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోడీ,షాల ప్రతిభకు ఈ ఎన్నికలు ఫలితం చూపబోతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పూర్తిస్థాయి ఆధిక్యం ప్రదర్శిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. రఫేల్‌ ఒప్పంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పదేపదే ఆరోపిస్తున్నా, దానికి సమాధానం రావడం లేదు. మోడీ పాలనలో కేవలం కార్పోరేట్‌ శక్తులు బలపడుతున్న తీరు ప్రజలను కలచి వేస్తోంది. పేద,సామాన్య ప్రజలు ఎంతగా చితకి పోతున్నారో గమనించడం లేదు. జిఎస్టీ కారణంగా వస్తువుల ధరలు పెరిగితే ఎవరికి నష్టమో ఎందుకు ఆలోచన చేయడం లేదు. దేనిని వదలకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వచ్చినంత మాత్రాన, ప్రభుత్వ ఆదాయం పెరిగినంత మాత్రాన ఆర్థిక సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయంటే ఎవరిని వంచించడానికి అన్నది ఆలోచన చేయాలి. ఇటీవల పటేల్‌ విగ్రహావిష్కరణ సందర్బంగా కూడా ప్రధాని మోడీ జిఎస్టీని సమర్థించుకున్నారు. జిఎస్టీతో దేశాన్ని ఏకం చేశామని వాదిస్తున్నారు. పెట్రో ధరల పెరుగుదలపైనా ఆర్థికమంత్రి జైట్లీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రజలు తమ సంపాదనంతా పెట్రోలు పైనే ఖర్చుపెడుతున్నారా అంటూ వెకారంగా మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సమస్యలపై స్పందించే గుణం లేకుండా పోయింది. దివంగత మాజీప్రధాని పివి నరసింహారావు పుణ్యమా అని ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు దేశ ప్రజలను గడపదాటి బయటకు వెళ్లేలా చేశాయి. ప్రజలు ప్రపంచాన్ని చూసేలా చేశాయి. ప్రపంచం భారత్‌ వైపు చేశాయి. మన మార్కెట్లు జోరందుకున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాలు సామాన్యుడికి కడుపునిండా భోజనం పెట్టేలా చేశాయి. ప్రతి వస్తువును కొనుగోలు చేసేలా చేశాయి. కానీ మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. అయినా కిందిస్థాయిలో ఏం జరుగుతందో తెలుసుకోలేని ప్రధాని మోడీ కేవలం తాను అనుసరించిన ఆర్థిక విధానాలను ప్రజలు ఆమోదించారంటూ, అందుకే గుజరాత్‌, హిమాచల్‌లో గెలిపించారని, ఇప్పుడు జరగబోయే ఎన్నకల్లోనూ గెలుస్తామని చెప్పుకోవడం ఆత్మవంచన తప్ప మరోటి కాదు. సంస్కరణలు ప్రజలు ఆమోదిస్తే, ప్రజలు బాగుపడితే గుజరాత్‌లో ఎందుకు ఎదురుగాలి వీచిందో వివేచన చేయాలి. ఎక్కడ తప్పిదం జరిగిందో ఆత్మపరిశీలన చేయాలి. గుజరాత్‌లో వ్యాపారులు ఎందుకు వ్యాపారాలు మానుకుంటున్నారో చూడాలి.ఎందుకు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారో గమనించాలి. ఇక ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా వస్తే పట్టపగ్గాలు ఉండవు. వారి నిర్ణయాలకు తిరుగుండదు. మోడీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నచందంగా ఉన్నారే తప్ప పరిస్థితులను విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకుంటామని ప్రకటించడం లేదు. ప్రజా నాయకులైతే ఇలాంటి విధానాలు పరిశీలన చేసుకోవాలి. ప్రస్తుతం జరగబోతున్న ఐదు రాస్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతాయ నడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల్లో నివురుగప్పిన అసంతృప్తిని గమనించి సర్దుకోకపోతే బిచాణా ఎత్తేయాల్సి ఉంటుందని గమనించాలి. ప్రజలు తమ అసంతృప్తులను వేర్వేరు సందర్భాల్లో తెలియ చేస్తున్నా గమనించడం లేదు. ప్రధాని తన వ్యక్తిగత ప్రతిష్ఠను పణంగా పెట్టి ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించలేకపోతున్నామని గమనించడం లేదు. నోట్ల రద్దు, జిఎస్టీ, పెట్రో ధరలు, రాఫెల్‌ ఒప్పందాలపై ప్రధాని పెదవి విప్పడం లేదు. తాజా ఎన్నికలు నిస్సందేహంగా

జాతీయ రాజకీయాలపై, మోదీ ప్రభుత్వ పరిపాలనపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక ఫలితాలు ఇప్పటికే బొప్పి కట్టాయి. పలు రాష్ట్రాల్లో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఫలితాల ప్రభావం వ్యతిరేకంగా ఉంటుందన డంలో సందేహం లేదు. ప్రధాని మోడీ ఛరిష్మా, పాలనా సంస్కరణలు బాగా ఉంటే గుజరాత్‌లో వందకూడా సీట్లను ఎందుకు గెల్చుకోలేక పోయారో సమాధానం ఇచ్చుకోవడం లేదు. కేవలం రాహుల్‌ను, కాంగ్రెస్‌ను తిట్టిపోస్తూ రాజకీయం చేయడమే పాలన కాదు. పాలనలో కొత్త ఒరవడి సృష్టించాలి. ప్రజలకు మేలు జరిగేల సంస్కరణలు ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఆహరధాన్యాల ధరలు తగ్గాలి. సంస్కరణలంటే ఇవే తప్ప మరోటి కాదని గుర్తుంచుకోవాలి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ధరలను, నేటి మార్కెట్‌ ధరలను ఎందుకు బేరీజు వేసుకోవడం లేదో ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రస్తుత ప్రజల ఆలోచనలు కాంగ్రెస్‌ వైపు మళ్లేలా చేసింది ప్రధాని మోడీ అని గుర్తించాలి. ఇకముందు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గట్టి సవాలు ఎదురవుతుందని భావించాలి. దానికి కాంగ్రెస్‌ గొప్పతనం కాకుండా మోడీ అనుసరిస్తున్న పిడివాద సంస్కరణల ఫలితమని గుర్తించాలి. రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష స్థానాన్ని అలంకరించాక తొఅలిదశలో పెద్దగా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుత మోడీ విధానాల కారణంగా ప్రజలు రాహుల్‌లో నాయకత్వ లక్షణాలను గుర్తిస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. పివి నరసింహారావు లాగా సంస్కర ణలు ప్రజలకు ఎందుకు మేలు చేయలేకపోతున్నాయో పరిశీలన చేయాలి. ఇప్పటికైనా నోట్లరద్దు,జిఎస్టీ విపరిణామాలను విశ్లేషించుకోవాలి. విమర్శలను హెచ్చరికగా తీసుకుని ముందుకు సాగితే తప్ప మనలేమని మిత్రద్వయం గుర్తించి ప్రజలకు మేలుచేసే పనులను చేపట్టి అమలు చేయాలి. అప్పుడే బిజెపి తన అస్తిత్వాన్ని నిలుపుకోగలదు. లేకుంటే 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఉంటే అది ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టదని గుర్తుంచుకోవాలి.