వ్యభిచారం చేయాలంటూ తల్లి, భర్త నిర్బంధం..కూతురు ఆత్మహత్య

నల్గొండ : జిల్లాలోని నకిరేకల్‌ మండలం, నోముల గ్రామంలో దారుణం జరిగింది. తల్లి, భర్త కలిసి వ్యభిచారం చేయాలని వేధించడంతో బీటెక్‌ (సెకండియర్‌) చదివిన ఝాన్సీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తల్లి హైదరాబాద్‌కు చెందిన విజయేందర్‌రెడ్డి వద్ద రూ. 4 లక్షలు అప్పు తీసుకుంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం. అప్పు తీర్చలేక తన కుమార్తె ఝాన్సీని వియజేందర్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేసింది. పెళ్లి సందర్భంగా ఝాన్సీ తల్లి వియజేందర్‌ వద్ద నుంచి రూ. 20 లక్షలు తీసుకున్నట్లుగా తెలిసింది. ఝాన్సీ అత్తగారింటికి వెళ్లిన తర్వాత వ్యభిచారం చేయాలని భర్త వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా తల్లి వ్యవహారం బయటపడడంతో ఝాన్సీ నిలదీసింది. దీంతో భర్త, తల్లి కలిసి వ్యభిచారం చేయాలంటూ ఝాన్సీని ఇబ్బందులకు గురిచేశారు.

దీంతో ఝాన్సీ ఈనెల 24న స్థానిక నకిరేకల్‌ సీఐ, పోలీస్‌ ఉన్నతాధికారులకు తన పరిస్థితిని వివరిస్తూ లేఖ రాసింది. ఆ తర్వాత అదే రోజు తన సోదరుని రూమ్‌ వద్ద సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. విషయం బయటకు పొక్కకుండా కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిర్వహించి దహనసంస్కారాలు నిర్వహించారు. అయితే ఝాన్సీ రాసిన లేఖ అందుకున్న సీఐ విచారణకు వచ్చారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఝాన్సీ సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.