వ్యవసాయంలో కూలీల కొరత

ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నా వ్యవసాయరంగంలో పురోగతి అనుకున్నంతగా కనిపించడం లేదు. అనేక బాలారిష్టాలు ఇంకా దాటాల్సి ఉంది. రైతులు శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. మార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా పంటలు పండించే స్థితిలో రైతులు కనిపించడం లేదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు పండించడంలో రైతులు మెళకువలు నేర్చుకోవడం లేదు. ఇప్పటికే అనేక పథకాలను ప్రభుత్వం రైతులకు చేరువ చేసింది.పెట్టుబడి కింద ఎకరాకు నాలుగువేలు నగదు ప్రోత్సాహకం ఇస్తోంది. అలాగే బీమా సౌకర్యం కల్పించింది. నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్దరణ చేపట్టడం ద్వారా భూరర్భ జలాలు అందుబాటులోకి తెచ్చారు. అయినా వెలితి కనిపిస్తోంది. వ్యవసాయరంగంలో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కూలీలు దొరకడం లేదు. ఉపాధి పథకం ద్వారా గ్రామాల్లో పనులు కల్పిస్తున్న కారణంగా వ్యవసాయ కూలీలు దొరకడం లేదన్న వాదన ఉంది. మరోవైపు కూలీపనులు దొరకడం లేదని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. లోపం ఎక్కడుందో అర్థం కావడం లేదు. గ్రామాల్లో కూలీలు దొరక్క రైతులు ఎక్కువ మంది పత్తిపంటలను వేస్తున్నారు. దీనికి పెద్దగా కలుపుతీయడం వంటి సమస్యలు ఉండకపోవడమే కారణమని చెబుతున్నారు. ఈ దశలో యాంత్రీకరణను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. యాంత్రీకరణ పనిముట్లకు కూడా సబ్సిడీ ఇస్తోంది. అయితే యాంత్రీకరణ వల్ల కూలీల పనులు దెబ్బతింటు న్నాయని మరోవైపే రైతుకూలీ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సమస్యపై అంతా ఆలోచన చేయాలి. వ్యవసాయరంగంలో కూలీలు దొరక్కపోవడానికి కారణాలు తెలుసుకోవాలి. పలుమార్లు సిఎం కెసిఆర్‌ సహా అనేకమంది ఈ సమస్యను ప్రస్తావిస్తూనే ఉన్నారు. విధిలేకనే యాంత్రీకరణకు మొగ్గు చూపుతున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తాజాగా వ్యవసాయంలో వరికోత యంత్రాను ప్రవేశపెట్ట బోతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయరంగంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సంప్రదాయానికి భిన్నంగా యాంత్రీకరణ చేసే ఆలోచన చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతివంద ఎకరాలకు ఓ ట్రాక్టర్‌, 150 ఎకరాలకు హార్వెస్టర్‌ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అర్హులైన రైతులను గుర్తించి సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించే పనిలో పడింది. మహిళా రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం గత సంవత్సరంలో 215 ట్రాక్టర్లు, 10 వరికోత మిషన్లు, 28 రోటోవేటర్లు, 3,846 టార్పలిన్లు పంపిణీ చేసింది. దీంతో సాగు సులువైందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అవసరాల దృష్ట్యా వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అర్హులైన రైతులందరికీ సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వేస్టర్లు, యాంత్రీకరణ పరికరాలను అందించాలని నిర్ణయించింది.ఈ మేరకు ప్రతి వంద ఎకరాలకు ఒక ట్రాక్టర్‌, 150 ఎకరాలకు ఒక హార్వేస్టర్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఆ శాఖ సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతాంగానికి ఎంతో మేలు చేకూరనున్నది. అలాగే కూలీల కొరతను అధిగమించేందుకు ఇదే మార్గమని భావిస్తున్నారు. వసాయ విస్తరణ అధికారులు తమకు కేటాయించిన క్లస్టర్ల వారీగా ప్రభుత్వం ఎన్ని సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చారు…? ఇంకెన్ని ఇవ్వాల్సి ఉన్నది? అని సర్వే చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా సర్వే చేయించి ట్రాక్టర్లు, హార్వేస్టర్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు

అవసరమైతే అంతా మొత్తాన్ని వ్యవసాయ బడ్జెట్‌లో పొందుపరుస్తారు. ప్రభుత్వం సబ్సిడీ ట్రాక్టర్లను వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మొదట మండల స్థాయి కమిటీ అర్హులైన రైతులను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో ఎంపీడీవో, తహసీల్దార్‌, మండల వ్యవసాయాధికారి ఉండాటారు. మండల స్థాయి కమిటీ ఎంపిక చేసిన జాబితాను జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు. కలెక్టర్‌ చైర్మన్‌గా ఉన్న జిల్లా కమిటీలో జిల్లా వ్యవసాయాధికారి, డాట్‌ శాస్త్రవేత్త, ఎల్‌డీఎం తదితరులు ఉంటారు. ముఖ్యంగా ట్రాక్టర్‌కు సంబంధించిన పరికరాలు, కలుపుతీసే యంత్రాలు, మందుల డబ్బాలు పంపిణీ చేస్తారు. అన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. బడ్జెట్‌ను బట్టి మొదటి దరఖాస్తు చేసుకున్న రైతులకు సాగు పరికరాలు అందిస్తారు. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి దరఖాస్తుల పక్రియ మొదలవుతుందని భావిస్తున్నాము. మొత్తంగా వ్యవసాయ రంగంలో మార్పులు అన్నవి మనుషుల అసవరం లేకుండా చేస్తున్నది. ఇది రానున్న కాలంలో విస్తరిస్తే భవిష్యత్‌లో మళ్లీ కూలీ కోసం వచ్చిన వారికి పనులు దొరకవు. గ్రామస్థాయిలో వ్వయసాయ కూలీలు దీనిపై ఆలోచన చేయాలి. వ్యవసాయ కూలీ సంగాలు ఆలోచన చేయాలి. ఓ రకంగా మనమే ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఒక్కసారి యంత్రాలకు అలవాటు పడితే ముందుముందు మళ్లీ మనుషులతో పనిచేయించేందుకు రైతులు ముందుకు రారు. అప్పుడు కావాలన్న పని దొరకదు. ఉచిత పథకాలకు అలవాటు పడి పనులు మానేస్తే రానున్న కాలం దుర్భరం కావడం ఖాయం అని గుర్తుంచు కోవాలి. ఇప్పటికైనా మేల్కోక పోతే మనం కోరి కష్టాలు కొనితెచ్చుకున్న వారం అవుతాం.