వ్యవసాయరంగంపై తీవ్ర నిర్లక్ష్యం

13న ఆందోళనలతో నిరసన
ఖమ్మం,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగంపై కేంద్రంనిర్లక్ష్యం, రైతు వ్యతిరేక బ్జడెట్‌ను నిరసిస్తూ ఈనెల 13న దేశవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌సిఫారుసుల మేరకు గిట్టుబాటు ధరలను అమలుచేస్తామని పాలకులు ఇచ్చిన హావిూలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. కేంద్రం అమలుచేస్తున్న బీమా పథకం కార్పోరేట్‌ కంపెనీలకు రూ.వేల కోట్ల లాభాలు సమకూరుస్తుందే తప్ప రైతులకు ఒరిగేదేవిూ లేదన్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, కనీసమద్దతు ధరలేక పండించిన పంటలను రైతులు నిప్పుపెట్టుకొనే దుస్థితి వచ్చిందన్నారు. సాగునీటి వసతి కల్పన, నకిలీ విత్తనాల బెడదను నివారించాలని, బలవంతపు భూసేకరణ విధానానికి స్వస్తిచెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం బ్జడెట్‌ కేటాయింపుల్లో వ్యవసాయరంగాన్ని విస్మరించిందని  ఆరోపించారు.
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలు చేపడుతున్నాయని ఆరోపించారు. మరో ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడానికి పంటల బీమా పథకం అమలు, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన బ్జడెట్‌లో కేవలం రూ.75వేల కోట్లు మాత్రమే కేటాయించారని, వీటితో రైతుల ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరుస్తారో చెప్పాలని డిమాడ్‌ చేశారు.