వ్యవసాయాన్ని పండుగలా మార్చాం

– రైతుబంధుతో గ్రామాల్లో పండుగ వాతావరణం
– తెలంగాణ వస్తే కరెంట్‌ ఉండదన్నారు
– 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం
– రైతుకు సాయం చేస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు
– విూలెక్క రైతును విస్మరించి మేం ప్రభుత్వాన్ని నడపలేం
– తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం
– రాష్ట్ర మంత్రి కేటీఆర్‌
– సిరిసిల్లలో రైతులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
రాజన్నసిరిసిల్ల, మే17(జ‌నం సాక్షి) : గతంలో పాలించిన పాలకులు వ్యవసాయాన్ని దండగ అంటూ రైతు వ్యవస్థను నిర్వీర్యం చేశారని, తెరాస హయాంలో  కేసీఆర్‌ నిర్ణయాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌లో మంత్రి కేటీఆర్‌ రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతు బంధు పథకం చెక్కుల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎక్కువ ఆత్మ సంతృప్తినిచ్చిందన్నారు. గత పాలకులు రూ.200 పెన్షన్‌ కోసం ముప్పు తిప్పలు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదని గత పాలకులు అన్నారన్నారు. గతంలో 6 గంటల కోసం రైతులు ధర్నాలు చేసేవారన్నారు. అదికూడా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు తమ పంటలకు నీరందించలేక ఎండిపోయి నష్టాలపాలయ్యేవారని అన్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాలకు 24గంటలు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందిస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు. కేసీఆర్‌ విధానాలతో, కేసీఆర్‌ సేవాగుణంతో తమ పార్టీల అడ్రస్సు ఎక్కడ గల్లంతవుతాయోనని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గతంలో పాలన సాగించిన కాంగ్రెస్‌ రైతులను ఆదుకొనేందుకు ముందుకు రాకుండా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న తెరాస రైతులను అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. గత ప్రభుత్వాల వలే తాము రైతులనువిస్మరించి ప్రభుత్వాన్ని నడపలేమని, తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ సీఎంగా నిలిచాడన్నారు. ఇటీవల కొన్ని విూడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో కేసీఆర్‌ నంబర్‌వన్‌ సీఎంగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. విత్తనాలు, ఎరువులను సీజన్‌కు ముందే రైతులకు అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్న ఆయన కల్తీవిత్తనాలు, ఎరువుల తయారీదార్లపై పీడీయాక్టులు పెట్టి జైల్లో పెడుతున్నామని స్పష్టం చేశారు. రైతులకు అందించే పెట్టుబడిని తిరిగి తీసుకునేది లేదని స్పష్టం చేసిన ఆయన పెట్టుబడి సాయంతో రైతులు సంతోషంగా ఉండాలన్నారు. రైతుబంధు చెక్కుల పంపిణీ పథకాన్ని ఎలక్షన్‌ స్‌ట్టంట్‌గా కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పేర్కొనడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాల్కసుమన్‌, ఎమ్మెల్సీ నారదాసు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
———————————————