వ్యవసాయ పరికరాల్లో ఎస్సీ,ఎస్టీ రైతులకు ప్రాధాన్యం

సబ్సిడీపై ట్రాక్టర్లు, రొటేవేటర్ల పంపిణీ

యాదాద్రి,జూలై20(జ‌నం సాక్షి): మారుతున్న కాలానికి అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలపై సర్వే చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు మహిళా రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చేందుకు ప్రాధాన్యతనిస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో 5, 311 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతి వంద ఎకరాలకు ఒక ట్రాక్టర్‌ను కేటాయించనుండగా.. ఇంకా జిల్లాకు 5, 387 ట్రాక్టర్లు అవసరం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 6, 296 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందుబాటులో ఉండగా.. ఇంకా 11, 845 అవసరం ఉన్నదని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలుతయారు చేసి నివేదికలు సమర్పించారు. లబ్ధిదారులు పట్టాదార్‌ పాస్‌పుస్తకాల జీరాక్స్‌తో రెండు ఎకరాలలోపు ఉన్న రైతులు అర్హులు. 5 లక్షల సబ్సిడీ కన్నా ఎక్కువ మొత్తంలో కలిగి ఉండే రుణసదుపాయం కలిగేందుకు రైతుల యొక్క గత రుణాన్ని పరిశీలించడంతో పాటు ఆరు సంవత్సరాల కాలవ్యవధిలో తీసుకున్న రుణాలు తదితర పరిగణలోకి తీసుకుంటారు. 2 లక్షల సబ్సిడీ కన్నా తక్కువ రుణాన్ని పొందే రైతులకు సంబంధించి రెండు సంవత్సరాల కాలవ్యవధిని పరిగణలోకి తీసుకుంటారు. రుణాల అర్హులను ఎంపిక చేసేందుకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ చైర్మన్‌ వ్యవహరించి డీఏవో, అగ్రోస్‌ తదితరులు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. నూతన జిల్లాలో మొత్తం 53 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించారు. ఒక్కో క్లస్టర్‌కు ఒక ఏఈవోను ప్రభుత్వం నియమించింది. 53 క్లస్టర్ల పరిధిలో 44, 46, 805 ఎకరాల భూమి సాగులో ఉన్నది. ఆలేరు నియోజకవర్గంలోని 7 మండలాల్లోని రైతులకు కేసీఆర్‌ ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాలు ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అందజేశారు. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, బీసీ రైతులకు 50 శాతం సబ్సిడీ కింద ట్రాక్టర్లతో పాటు పొలాలు దున్నెందుకు కావాల్సిన రోటోవెటర్లను మంజూరు చేశారు. ఎస్సీ, ఎస్టీ కోటా కింద మండలానికి ఒక యూనిట్‌గా కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రానికి ఎస్సీ కోటా కింద ఒక యూనిట్‌ రాగా జనరల్‌ కోటా కింద 8 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఇందులో రాష్ట్ర బడ్జెట్‌ నార్మల్‌ స్టెట్‌ ప్లాన్‌, స్టేట్‌ రిజర్వుడ్‌ పథకం కింద 6, కేంద్ర రాష్టీట్ర కృషి వికాస్‌ యోజనా పథకం కింద 2 ట్రాక్టర్లు వచ్చాయి. యంత్ర సేద్యంతో వ్యవసాయంలో నూతన ఓరవడి సృష్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ ట్రాక్టర్‌ పంపిణీ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆలేరు మండలంలో 2017-18లో 9 మంది రైతులకుసబ్సిడీ ట్రాక్టర్లతోపాటు 2 వరికోత మిషన్‌లను రైతులకు అందజేశారు. వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందించేందుకు మండలంలో 8 ట్రాక్టర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. రాజాపేట మండలంలోని 50 శాతం సబ్సిడీ కింద రైతులకు 12 ట్రాక్టర్లను అందజేశారు. తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు 11 సబ్సిడీ ట్రాక్టర్లను 2 రోటోవెటర్లను పంపిణీ చేశారు. బొమ్మలరామారం మండలంలో 12 సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు అందజేశారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని పలుగ్రామాలలోని రైతులకు 50శాతం సబ్సిడీ కింద వరికోత మిషన్‌ పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 95, జనరల్‌ కోటా 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లను అందించాం. గతంలో ఉన్న సబ్సిడీలలోనే ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఈ సబ్సిడీ పథకాలపై కలెక్టర్‌ నిర్ణయం మేరకు పంపిణీ పక్రియ జరుగుతున్నది.