శబరిమలకు 36మంది మహిళల నమోదు

తిరువనంతపురం, నవంబర్‌14 (జనం సాక్షి)  : శబరిమల ఆలయ దర్శనానికి మహిళలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ కమిటీ స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌లో రిజిస్టేష్రన్‌ ప్రారంభించింది. ఇప్పటి వరకు స్వామి వారిని దర్శించుకోవడం కోసం 36మంది మహిళలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడడానికి కొద్ది సమయం ముందే ఈ రిజిస్టేష్రన్‌ జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది సెప్టెంబర్‌ 28న ఆలయం లోపలికి మహిళల ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. గతంలో 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం నిషేధం. కోర్టు తీర్పునిచ్చిన తరువాత ఈ ఏడాది జనవరి 2న ఇద్దరు మహిళలు ఆలయ ప్రవేశం చేశారు. గతేడాది కూడా నిషేధిత వయస్సు కల 740మంది మహిళలు ఆలయ ప్రవేశం కల్పించలంటూ ఆన్‌లైన్‌ నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరించిన తరువాత వారి ఇళ్లకు వెళ్లి వారు తీర్థయాత్రకు రావడం లేదని స్పష్టం చేసుకున్నారు. ఇప్పుడు నమోదు చేసుకున్న 36మంది మహిళల వివరాలను పోలీసులు సేకరించారని సమాచారం. తాజాగా వెలువడిన సుప్రీం తీర్పు గురించి ప్రస్తావించడానికి ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ నిరాకరించారు. దేవాదాయ రాష్ట్ర మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ విూడియాతో మాట్లాడుతూ సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందన్నారు.