శబరిమల కాదు..స్త్రీ సమస్యలపై పోరాడాలి

కోల్‌కత,నవంబర్‌17(జ‌నంసాక్షి): దేశంలో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వేళ వబరిమల గురించి పట్టుపట్టడంపై వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లిమా నస్రీన్‌ ఆవేదన చెందారు. మరోసారి ట్విట్టర్‌ వేదికగా గళం విప్పారు. దేశంలోని స్త్రీలు గృహహింస, అత్యాచారం, వేధింపులు, ఆరోగ్యం, ఉద్యోగం, స్వేచ్ఛ వంటి సమస్యలతో సతమతమవుతుంటే వాటిని పరిష్కరించేందుకు గ్రామాల్లో పోరాడాల్సిన మహిళా కార్యకర్తలు శబరిమల ఆలయ ప్రవేశానికి పోరాడటం విడ్డూరంగా ఉందని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. కేవలం ఆలయ ప్రవేశానికి మహిళలు అత్యుత్సాహం చూపించటాన్ని ఆమె విమర్శించారు. ఇదిలా ఉండగా శబరిమల అయ్యప్ప స్వామిని ఎలాగైనా దర్శించుకు తీరుతానన్న సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌కి కోచి విమానాశ్రయంలో భక్తులు నుంచి నిరసన సెగ తగిలింది. ఆమెను ఆలయంలోకి ప్రవేశించకుండా విమానాశ్రయంలో అడ్డుకోవటంతో చేసేదేమి లేక తన వెంటవచ్చిన వారితో సహా తృప్తి ముంబైకి తిరిగి వెళ్లిపోయారు. శబరిమలలో రుతుక్రమం కలిగిన మహిళా భక్తులకు ప్రవేశం కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.