శబరిమల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

శబరిమల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

విశాఖ -కొల్లాం మధ్య ఈనెల 17 నుంచి అమలు

విశాఖపట్నం,నవంబర్‌6(జ‌నంసాక్షి): శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని తూర్పుకోస్తా రైల్వే నిర్ణయించింది. విశాఖ -కొల్లాం మధ్య ఈనెల 17 నుంచి జనవరి 17 వరకు వారానికి రెండు పర్యాయాలు 13 ట్రిప్పులు రైళ్లు నడుపుతారు. నంబరు 08515 గల రైలు ప్రతి శని, మంగళవారం విశాఖ నుంచి రాత్రి 11.15 నిమిషాలకు బయలుదేరి సోమ, గురువారాల్లో ఉదయం ఏడుగంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగుపయనంలో నంబరు 08516 రైలు సోమ, గురువారం కొల్లాం నుంచి ఉదయం పదిగంటలకు బయలుదేరి విశాఖకు మంగళవారం, శుక్రవారం సాయంత్రం 6.30కి చేరుకుంటుది. ఈ రైలు విశాఖ-కొల్లాం మధ్య దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడు, వినయంబడి, జోలార్‌పెట్టి, సేలం, ఈరోడ్‌, తిరుపూర్‌, కోయంబత్తూరు జంక్షన్‌, పాల్ఘాట్‌, ఓట్టపాలెం, త్రిచూర్‌, ఆలువ, ఎర్నాకుళంటౌన్‌, చెంగన్నూర్‌, మావెకల్లార్‌, కయనకుళంలో ఆగుతుంది. మొత్తం 16 కోచ్‌లతో ఉండే రైలులో ఒక సెకండ్‌ ఏసీ, మూడు థర్డ్‌ ఏసీ, మూడు స్లీపర్‌, ఏడు జనరల్‌, రెండు సెకండ్‌క్లాస్‌ కమ్‌ లగేజీ కోచ్‌లుంటాయి. శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జి.సునీల్‌ కుమార్‌ తెలిపారు