శరవేగంగా గజ్వెల్‌ రైల్వే ట్రాక్‌ పనులు

జూలైలో రైలు కూత పెడుతుందన్న అధికారులు
గజ్వేల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): గజ్వెల్‌కు రైల్వే ట్రాక్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గజ్వేల్‌ – సిద్దిపేట మధ్య రైల్వే నిర్మాణానికి అవసరమైన మేరకు భూసేకరణ పూర్తి కాలేదని, నిర్మాణ పనులు కొనసాగుతున్నా, భూసేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో ఆలస్యమవుతుందన్నారు. మరో రెండేండ్లలో సిద్దిపేటకు కూడా పనులు పూర్తి చేసి రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అయితే  జూలై మొదటి వారంలోగా గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలకు రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకుని వస్తామని రైల్వేశాఖ కన్‌స్టక్షన్ర్‌ విభాగం డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ సుబ్రహ్మణ్యం అన్నారు. గజ్వేల్‌ మండలం గిరిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి, ట్రాన్‌ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులు, కంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మనోహరాబాద్‌-గజ్వేల్‌ మధ్య రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రెవెన్యూ అధికారులు భూసేకరణ పూర్తి చేయడంతో ఇబ్బందులు తొలిగిపోయి నిర్మాణ పనుల్లో వేగం పుంజుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరువతో జరుగుతున్న రైల్వేట్రాక్‌ నిర్మాణ పనులు మరో రెండునెలల్లో పూర్తి చేయడంతోపాటు రైలు ప్రయాణానికి అవసరమైన అన్నిఏర్పాట్లు జూన్‌ చివరిలోగా పూర్తి చేస్తామన్నారు. జూలై మొదటి వారంలో గజ్వేల్‌ ప్రజలకు రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడానికి పనుల్లో వేగం పెంచాలని అధికారులు, కంట్రాక్టర్లకు సూచించినట్లు తెలిపారు.  ఆయన వెంట రైల్వే ఇంజినీర్‌ అధికారులు మల్లికార్జున్‌, జనార్దన్‌, ఇతర అధికారులు, కంట్రాక్టర్లు ఉన్నారు.