శాంతి భద్రతల విషయంలో..  టీడీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది


– థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించడానికి టీడీపీకి భయమెందుకు?
– రాహుల్‌ మొద్దబ్బాయి అన్న బాబుతో రాహుల్‌ పొత్తా!
– బాబు అవకాశవాద రాజకీయాలతో తెలుగు ప్రజలు తలదించుకుంటున్నారు
– వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : ఆంద్రప్రదేశ్‌లో శాంతిభద్రతల విషయంలో టీడీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తే పట్టించుకోని పోలీసులు, వైసీపీ నేతలపై కేసులు బనాయిస్తుందని  వైఎస్సార్‌సీపీ నేత, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు దేశంలోని జాతీయ పార్టీ నాయకులను కలుస్తూ.. ఏపీలో ధర్మపోరాట దీక్షలు చేస్తానని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు అయ్యే ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి దుబారా చేయడం కాదా అని బుగ్గన ప్రశ్నించారు. ధర్మ పోరాటం అని  చెబుతున్న బాబు వైసీపీ నాయకులను టీడీపీలోకి ఎలా చేర్చుకున్నారని సూటిగా ప్రశ్నించారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి చేరిన నాయకులకు మంత్రి పదవులు అధర్మంగా ఇవ్వలేదా అని ప్రశ్న లేవనెత్తారు. జన్మభూమి కమిటీలు, నీరు-చెట్టు, రోడ్ల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి తారాస్థాయిలో ఉందని విమర్శించారు. ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా, చంద్రన్న కానుకల్లో కల్తీ సరుకులు వస్తున్నాయని, ఇలా ప్రతిదానిలో అవినీతి కనపడుతున్నా ధర్మపోరాటాలంటూ బాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని అన్నారు. గత ఎన్నికల సమయంలో సోనియా గాంధీని అనకొండ అని..అల్లుడు రాబర్ట్‌ వాద్రాను పిల్ల అనకొండ అని చంద్రబాబు తీవ్రంగా విమర్శించలేదా అని ప్రశ్నించారు. సోనియాను ఇటలీ బొమ్మ, మన్మోహన్‌ సింగ్‌ను రబ్బర్‌ స్టాంప్‌ అని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. స్వతంత్యం రావాలంటే కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలి..సోనియా గూబ గుయ్యిమనిపించాలని, రాహుల్‌ గాంధీ మొద్దబ్బాయి అని బాబు అన్న విషయాలను ప్రస్తావించారు. ఇంత దారుణంగా కాంగ్రెస్‌ను, సోనియాను, రాహుల్‌ను తిట్టిన బాబుతో కాంగ్రెస్‌ వారు పొత్తుపెట్టుకోవడం దారుణమన్నారు. బాబు లాంటి అవకాశవాదితో వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవడం సిగ్గులేని చర్య అని వ్యాఖ్యానించారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించడానికి టీడీపీ ఎందుకు భయపడుతుందని తీవ్రంగా విమర్శించారు.