శాస్త్రీయత లేని ఓటు నమోదు కార్యక్రమం

ఇన్నేళ్ల ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ పక్కాగా ఓటు నమోదు కార్యక్రమం లేదు. ఎన్నికల ముందు ఓటర్ల నమోదు ఓ ప్రహసనంగా మారింది. ఆన్‌లైన్‌లో పక్కాగా అమలు జరిగే వ్యవస్థ లేదు. ఆధార్‌ లాగా ఓటు కార్డు పొందేలా కార్యాచరణ లేదు. ఏటా ఓటర్ల నమోదు ఓ ప్రహసనంగా మారింది. ఎన్నికల ముందు హడావిడి చేయడం, ఓట్లు పోయాయని కొందరు, దొంగవోట్లు నమోదయాయ్యాయని మరికొందరు పరస్పరం ఆరోపణలుచేసుకోవడం పరిపాటిగా మారింది. లక్షల్లో ఓట్లు గల్లంతని కొందరు ఆరోపిస్తున్నారు. అలాగే ఓటేయడానికి వెళ్లిన వారికి తమ ఓటు లేదన్న విషయం అప్పుడే తెలుస్తుంది. ఇలాంటి గందరగోళంఎందుకు జరుగుతోంది. పక్కా ఓటు నమోదు వ్యవహారాన్ని ఏ కార్పోరేట్‌ కంపెనీకి అప్పగించినా చేసి పెడుతుంది. ఎన్నికల సంఘం వేలాదికోట్లు ఖర్చు పెట్టినా పక్కాగా ఓటర్ల నమోదు కార్యక్రమం ఉండడం లేదు. ఒకే కుటుంబంలో ఉన్న వారి ఓట్లు కొన్ని గల్లంతు కావడం, వేర్వేరు బూతుల్లో ఓట్లు ఉండడం మరో వింత. ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. దేశ భవిష్యత్తును నిర్దేశించడంలో, ప్రజాస్వామ్యాన్ని వికసింపచేయడంలో అతి ముఖ్యమైనది ఓటు మాత్రమే. ప్రపంచంలోనే అత్యధిక శాతం యువతను కలిగి ఉన్న దేశాల్లో మనం కూడా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ ప్రజలు వారి ఓటే కీలకం. వారు నిర్ణయించిన వారే రాజ్యం ఏలాలి. కానీ అలా జరగడం లేదు. ఓటుతో దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయం యువతపైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహమే అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు యువతలో ఎంతమందికి ఓటుపై పరిపూర్ణ అవగాహన ఉందంటే అనుమానమే. కుటుంబం, విద్యాలయాల్లో దీని ప్రాముఖ్యతపై ప్రస్తావన ఉండటం లేదన్న ప్రజాస్వామ్యవాదుల ఆవేదనలో నిజం లేకపోలేదు. ఈ లోపాన్ని సవరించడానికి, ఓటు ప్రాధాన్యం యువతకు ముఖ్యంగా విద్యార్థులకు తెలియపరిచే దిశగా ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంటున్నది. విద్యాలయాల్లో, కళాశాలల్లో ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమాల ద్వారా పరిపూర్ణ అవగాహనను కల్పించాలని నిర్ణయించింది. చాలామందికి ఓటు నమోదు చేయించుకోవాలన్న విషయమూ తెలియదు. అధికారులు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారు. విద్యార్థులు, కళాశాలల సంఖ్యను ప్రమాణంగా తీసుకొని ఎన్నికల అధికారులు ఓటు నమోదు ఏర్పాటుచేయాలి. నిజానికి ఎలక్టోరల్‌ బృందాలు ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి ఒక అధ్యాపకుడిని సమన్వయకర్తగా నియమించాలి. అప్పుడే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టవచ్చు. యువతను ఓటర్లుగా నమోదు చేయించేందుకు విద్యాసంస్థల్లో క్లబ్‌లను ఏర్పాటు చేశామని ప్రకటిస్తున్న అధికారులు, వారికి అవగాహన కల్పించే కార్యక్రమాల దిశగా ఇప్పటి వరకు కార్యాచరణ ప్రకటించలేదు. కనీస స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించలేదని ఆరోపణలు న్నాయి. విద్యార్థులతో క్లబ్‌లను ఏర్పాటు చేసి, కార్యక్రమాలను నిర్వహించకపోతే వారికి అవగాహన ఎలా వస్తుందనే ప్రశ్నలు బలంగానే వినిపిస్తున్నాయి. ఓటుపై అవగాహనను కల్పించడంతోపాటు దాని విలువ, ప్రజాస్వామ్యంలో ప్రభావాన్ని క్షుణ్ణంగా వివరించినప్పుడే, విద్యార్థులు దాని ప్రాధాన్యం తెలుసు కోవడంతోపాటు వారికి కుటుంబ సభ్యులకు వివరించగలుగుతారు. అసలు ఏర్పాటు ఉద్దేశమే నెరవేర నప్పుడు మొక్కుబడి పనులతో ఉపయోగం అధికారులకే తెలియాలి. గ్రామస్థాయిలోనే వారికి ఓటుహక్కు ప్రాధాన్యం వివరించాలి. ఇప్పటివరకు సమావేశ సరికదా క్లబ్‌ల ఏర్పాటే పూర్తికాలేదు. ఓటింగ్‌ విధానంలో కీలకమైన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, నోటా, ఓటు ప్రాధాన్య విషయాలను వివరించడంతో పాటు వాటికి సంబంధించిన మెటీరియల్స్‌ను కూడా అందజేయాలి. ఇప్పటి వరకు ఆ కార్యక్రమాలను నిర్వహించలేదు. అధికారులు చొరవ తీసుకొని బృందాల ఏర్పాటు స్ఫూర్తిని, ఓటు అవగాహనను కల్పించే విషయంలోనూ ప్రదర్శిస్తే మేలు. ఇవన్నీ జరగాలంటే పక్కాగా ఓటరు నమోదు వ్యవస్థను ముందుగా రూపొదించాలి. సాంకేతికంగా బలపడిన ఈ కాలంలో ఇంకా ఓటు నమోదుకు అనేక అడ్డంకులుఉన్నాయి. ఆధార్నమోదు కావాలంటే దేశంలోని వారంతా చచ్చినట్లు నమోదు చేయించుకున్నారు. జన్‌ధన్‌ ఖాతాలనగానే ఓపెన్‌ చేశారు. అక్కడ లేని అవాంతరాలు ఇక్కడే ఎందుకన్నది ప్రశ్న.ఏటా ఓటరు నమోదు అన్నది ఓ ప్రహసనంగా ఎందుకు మారాలి. రాజ్యాంగ పరంగా నిర్ణయం తీసుకుని పక్కాగా వ్యవస్తను ఏర్పాటు చేయాలి. ఏటేటా ఎవరు అర్హులో వారే నమోదు చేసుకోవాలి. చనిపోయిన వారి ఓట్లు మాత్రమే తొలగించాలి. ఎక్కడిక్కడ అడ్రస్‌ మార్చుకునే వెసులబాటు రావాలి. ఇలా చేయనంత కాలం ఓటరు నమోదు ప్రహసంగానే ఉంటుంది. దీనికి కార్యాచరణ చేయాలి. పక్కాగ నమోదుకు వ్యవస్థ ఉండాలి. ఆన్‌లైన్‌లో లూదా పంచాయితీ లెవల్లో నమోదు చేసుకునే యంత్రాంగం ఉండాలి. ఈ రకంగా చర్య తీసుకోనంత కాలం మనమెన్ని ప్రయత్నాఉల చేసినా సత్ఫలితం రాదు.