శివమొగ్గ విజయంతో ఊపిరి పీల్చుకున్న బిజెపి

 

పట్టు నిలబెట్టుకున్న మాజీ సిఎం యెడ్యూరప్ప

బళ్లారిలో కాంగ్రెస్‌ పాగాతో పోయిన బిజెపి పరువు

బెంగుళూరు,నవంబర్‌6(జ‌నంసాక్షి): చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా శివమొగ్గలో బీజేపీ విజయం సాధించింది. ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తరపున పోటీ చేసిన బీవై రాఘవేంద్ర సుమారు 52 వేల 148 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై నెగ్గారు. జేడీఎస్‌ పార్టీకి చెందిన మధు బంగారప్పపై ఆయన విజయం సాధించారు.

వాస్తవానికి కర్నాటక బైపోల్స్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. అయితే 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, ఒక్క శివమొగ్గలోనే బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడే రాఘవేంద్ర. యడ్యూరప్ప రాజకీయ ప్రవేశం నుంచి శివమొగ్గలో బీజేపీదే ఆధిపత్యం. అయితే తాజాగా రాఘవేంద్ర విజయంతో.. ఆ ప్రాంతంలో బీజేపీ హవా మరోసారి రుజువైంది. శివమొగ్గలో లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ. అయితే రెండవ స్థానంలో ఉన్న ఎడిగ వర్గ ప్రజలు జేడీఎస్‌ అభ్యర్థి మధు బంగారప్పకు ఓట్లు వేస్తారని భావించారు. కానీ ఫలితాలు మాత్రం తారుమార య్యాయి. అయితే మాజీ సెం బంగారప్ప కుమారుడు పోటీలో ఉన్నా రాఘవేంద్ర గెలిచి బిజెపి పరువు నిలిపాడు. ఇది యడ్యూరప్పకు ఓ రకంగా పరువు నిలిపే విషయం.

మాండ్యాలో తప్పని పరాభవం

ఇకపోతే మాండ్యా పార్లమెంట్‌ స్థానాన్ని .. జేడీఎస్‌ అభ్యర్థి ఎల్‌ఆర్‌ శివరామ గౌడ గెలుచుకున్నారు. భారీ తేడాతో ఆయన ప్రత్యర్థిని మట్టికరిపించారు. 17 రౌండ్ల తర్వాత ఆయన సుమారు 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. నాగమంగల తాలూకకు చెందిన శివరామ గౌడ.. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. గతంలో బెంగుళూరు డెవలప్‌మెంట్‌ అథారిటీకి ఆయన చైర్మన్‌గా చేశారు. బెంగుళూరులో శివరామ గౌడ పేరిట అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. కల్యాన్‌ నగర్‌లో ఉన్న రాయల్‌ కాంకర్డ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వ్యవస్థాపకుడు ఈయనే. గతంలో ఓ జర్నలిస్టు హత్య కేసులో శివరామ గౌడపై ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ కేసులో ఆయన క్లీన్‌గా బయటపడ్డారు. బైపోల్‌లో శివరామ గౌడకు మొత్తం 5 లక్షల 53 వేల 374 ఓట్లు పోలయ్యాయి. ఆయన ప్రత్యర్థి, బీజేపికి చెందిన సిద్దరామయ్యకు కేవలం 2 లక్షల 44 వేల 377 ఓట్లు మాత్రమే పడ్డాయి.

బీటలు వారిన బళ్లారి

కర్నాటకలో బీజేపీ కంచుకోట బీటలువారింది. బీజేపీ సొంతమైన బళ్లారీ స్థానాన్ని.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. ఆ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వీఎస్‌ ఉగ్రప్ప గెలుపొందారు. ఆయన 2లక్షల 43 వేల 161 ఓట్ల తేడాతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి వీ శాంతపై ఆయన విజయం సాధించారు. బీజేపీ నేత బీ. శ్రీరాములు సోదరియే శాంత. అయితే అత్యంత కీలకమైన బళ్లారి స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. బైపోల్స్‌ కోసం కాంగ్రెస్‌ అభ్యర్థి తరపున ఆ పార్టీ ముఖ్యనేత డీకే శివకుమార్‌.. చాలా తీవ్రంగా ప్రచారం చేశారు. గాలి సోదరులకు నిలయమైన బెల్లారీలో కాంగ్రెస్‌ పార్టీ రెపరెపలాడడం.. ఇది నిజంగా బీజేపీకి మింగుడు పడని విషయమే. 2004 నుంచి బెల్లారీలో బీజేపీదే పైచేయి. కానీ ఈసారి ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. ఉగ్రప్ప బయటి వ్యక్తియే అయినా.. జేడీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలు మాత్రం ఆయన కోసం తీవ్రంగా ప్రచారం చేశాయి. బెల్లారీ సీటుపై గతంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ¬రా¬రీ పోరు సాగింది. 1999లో ఈ స్థానం నుంచి సోనియా గాంధీ గెలుపొందారు. అప్పట్లో ఆమె .. ప్రస్తుత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌పై విజయం సాధించారు. అయతే 2004లో మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. అప్పటి నుంచి ఆ స్థానంలో బీజేపీ ఖాతాలోనే ఉన్నది. మళ్లీ ఇప్పుడు ఆ స్థానం కాంగ్రెస్‌ పార్టీకి వెళ్లడం విశేషం.