శేరిలింగంపల్లిలో చిచ్చు

స్వతంత్రంగా పోటీ చేస్తానన్న భిక్షపతి

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అరికపూడికి నిరసన సెగ

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో చిచ్చురేగుతోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం పునరాలోచించుకోవాలని మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ కోరారు. ఆ స్థానం తనకు కేటాయించకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ సీటును మహాకూటమి పొత్తులో భాగంగా తెదేపాకు కేటాయించారని… అయితే తాను ఇప్పటికే అధిష్టానం సూచన మేరకు నెల రోజులుగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నానని ఆయన చెప్పారు. మసీదు బండాలోని తన నివాసంలో భిక్షపతి యాదవ్‌ మంగళవారం అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటికైనా పునరాలోచించుకోకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. గతంలో రాహుల్‌గాంధీ బహిరంగ సభకు తానెంతో కృషి చేశానని ఆయన తెలిపారు. ఇకపోతే శేరిలింగం పల్లి నియోజకవర్గ తెరాస అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌కు వెళ్లిన ఆయన్ని స్థానికులు నిలదీశారు. వెంకటేశ్వర కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ప్రశ్నించారు తెరాస కార్యకర్తలు ఉన్నచోటే అభివృద్ధి చేసి… మిగతా

ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో గాంధీ వారికి సర్దిజెప్పి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.