శ్రీ రెడ్డి నీకు వందనం: రామ్‌గోపాల్ వర్మ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌(మహిళలపై లైంగిక వేధింపులు) ఉందంటూ నటి శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రవర్తనకు విసుగెత్తిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వబోమని ఇటీవల వెల్లడించింది. ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగడంతో ఆమెపై విధించిన నిషేధాన్ని ‘మా’ ఎత్తివేసింది.

అయితే చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసించారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘కాస్టింగ్‌ కౌచ్‌ అనేది వందేళ్ల క్రితం చిత్ర పరిశ్రమ పుట్టినప్పటి నుంచే ఉంది. గత వందేళ్లలో ఏ ఒక్కరూ మాట్లాడని విషయాన్ని శ్రీరెడ్డి లేవనెత్తారు. అందుకు నేను ఆమెకు సెల్యూట్‌ చేస్తున్నాను. శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసనకు దిగడం తప్పే. అలా చేస్తే గానీ జాతీయ, అంతర్జాతీయ సంఘాలు రంగంలోకి దిగలేదు. ఆమెను చూసి తల్లి చాలా గర్వపడతారు. చెప్పాలంటే.. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం కత్తిపట్టి ఎలా పోరాడారో ‘శ్రీ లక్ష్మీబాయి’ కూడా తన దేహంతో చిత్ర పరిశ్రమలో పేరుకుపోయిన అరాచకాలపై పోరాడారు’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు వర్మ.

చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళల కోసం ‘మా’ అసోసియేషన్‌..  ‘కమిటీ అగైన్‌స్ట్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌’ పేరిట ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సినీ పరిశ్రమకు చెందిన సీనియర్‌ నటులు, దర్శకులు, నిర్మాతలు ఉంటారు. మూడు నెలలకోసారి జరిగే సమావేశంలో ఎవరెవరికి సభ్యత్వాలు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటామని మా అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు.