సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: ఎమ్మెల్యే

సిద్దిపేట,జూన్‌19(జ‌నం సాక్షి): సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఆసరా పింఛన్‌ ద్వారా ప్రతి ఒక్కరికి రూ. 1000, రూ. 1500 అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తెల్లకార్డుపైన గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కొక్కిరి 4 కేజీలు, గరిష్టం 20 కేజీలు పరిమితులు పెడితే తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున ప్రతి ఒక్కరికి బియ్యం అందిస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వ హాస్టల్‌, పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యం భోజనం ప్రతి ఒక్కరికి అందిస్తున్నామన్నారు. ఆడపిల్లలను భారంగా చూస్తూ అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిని విధంగా కులమతాలకు అతీతంగా 18 ఏళ్లు నిండి తెల్లరేషన్‌ కార్డు ఉన్న యువతులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల ద్వారా రూ. లక్షా116లు అందిస్తున్నామని చెప్పారు. ఆశా వర్కర్లకు తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ వారి వేతనాలను పెంచారని, అంగన్‌వాడీ, సింగరేణి కార్మికుల వేతనాలను, వీఆర్‌ఏల వేతనాలను పెంచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నారు. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి ద్వారా రూ. 12 వేలు, కేసీఆర్‌ కిట్‌ ద్వారా రూ. 2 వేలు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణా మాత్రమేనన్నారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో ఓటు అడగనని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంటి సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.