సంక్షేమ ఫలాలు అర్హులకు అందించాల్సిన బాధ్యత

కుల సంఘాల బాధ్యులపై ఉంది
మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుంది
మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులతో ఎంపీ కవిత సమావేశం
నిజామాబాద్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత కుల సంఘాల బాధ్యులపై ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంపీ కవిత నిజామాబాద్‌ లోని తన కార్యాలయంలో నిజామాబాద్‌ నగరంలోని 16 మున్నూరు కాపు సంఘాల బాధ్యులతో బుధవారం సమావేశమయ్యారు. మున్నూరు కాపుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత వారినుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, చాలా మందికి ఆయా పథకాల గురించి పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో సకాలంలో ప్రయోజనం పొందలేక పోతున్నారని కవిత చెప్పారు. మున్నూరు కాపు కులస్తుల్లోనూ ప్రభుత్వ పథకాల పట్ల పూర్తి స్థాయి అవగాహన లేదని, కుల పెద్దలుగా అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి, కుల బాంధవులకు మధ్య వారధిగా కుల సంఘాల బాధ్యులు వ్యవహరించాలన్నారు. డిసెంబర్‌ నాటికి నిజామాబాద్‌ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం ఉందని, అంత వరకు ఇబ్బంది ఉన్నా ఓర్చుకోవాలన్నారు. నిజామాబాద్‌ సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కవిత తెలిపారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇంటింటికీ తాగు నీరు, విశాలమైన రోడ్లు, లైటింగ్‌, కూడళ్ల అభివృద్ధి, బైపాస్‌ రోడ్డు తదితర సౌకర్యాలతో త్వరలోనే నిజామాబాద్‌ నగరం సుందరంగా కనిపించనుందని వివరించారు. గతేడాది నుంచి రోడ్ల అభివృద్ధికి రూ.150 కోట్లు ఖర్చు చేసిందని, 3,500 డబుల్‌ బెడ్‌ రూం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. ఈ నెల 25న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌ అభివృద్ధిపై సవిూక్షిస్తారని కవిత తెలిపారు. నిజామాబాద్‌ నగరంలో మున్నూరు కాపు సంఘం బలంగా ఉన్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో మున్నూరు కాపు సంఘం ఏర్పడితే కమ్యూనిటీ పరంగా మేలు జరుగుతుందని ఎంపీ కవిత సంఘాల నేతలకు సూచించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని, గ్రావిూణ ప్రాంతం నుంచి సిటీలో చదువుకునే విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు హాస్టల్‌ సదుపాయం కల్పించాలన్నారు. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో హరిత హారంలో మున్నూరు కాపులు పాల్గొని, విరివిగా మొక్కలను నాటాలని ఎంపి కవిత కోరారు. పర్యావరణ పరిరక్షణకు అన్ని వర్గాలు పాటు పడేలా కుల పెద్దలు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్‌ నగరంలోని 16 మున్నూరు కాపు సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.