సంప్రదాయబద్ధ చదువులకు చరమగీతం పాడాల్సిందే 

ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగ విజయం!
మారుతున్న క్యాంపస్‌ ఎంపికల తీరు
హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఏటా ఇంజినీరింగ్‌లో చేరుతున్న విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఆశించిన ఉద్యోగాల్ని సాధించలేక విఫలమవుతున్నారు. దొరికిన కొలువులో చేరిపోతూ నెట్టుకొస్తున్నారు. ఏటా బీటెక్‌లో చేరే విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా 55 వేల నుంచి 60 వేల మంది ఉంటున్నారు. 95 శాతం ఉత్తీర్ణతతో కొలువులకు సై అంటున్నారు. మారిన ప్రాంగణ ఎంపికల తీరుకు తగ్గట్టుగా విద్యార్థులు సంసిద్దులు కావడం లేదని నిపుణులు అంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యలంఓ అనేక ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనే ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎక్కువగా నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు నగరంలోనే ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాల తర్వాత వరంగల్‌లోనే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎక్కువ.. ప్రాంగణ ఎంపికలు బాగున్నా… పేరొందిన కంపెనీల్లో కొలువు సాధించడం మాత్రం కష్టమవుతోంది. తత్ఫలితంగా ఏటా ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. మరో వైపు ఏటా ఇంజినీరింగ్‌ పూర్తిచేసి బయటకొస్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోయి విపరీతమైన పోటీ ఏర్పడుతోంది. బహుళ జాతి సంస్థల (ఎంఎన్‌సీ) ప్రాంగణ ఎంపికల ద్వారా తాజా విద్యార్థులను తీసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నాయి. వీరితో తక్కువ జీతాలకే పనిచేయించుకోవడంతో పాటూ వారికి అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చుకునేందుకు వీరైతే అనువుగా ఉంటారని భావించి వీరి వైపు మొగ్గుచూపుతున్నాయి. ఎంటెక్‌ చేసిన వారికంటే బీటెక్‌ వారికే చాలా సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 150 సుమారు ఇంజినీరింగ్‌

కళాశాలలు ఉన్నాయి. హైదరాబాద్‌ మినహాయిస్తే తెలంగాణలో సుమారు 40 మాత్రమే ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 190 వరకు ప్రభుత్వం, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రాంగణ ఎంపికల్లో కొలువులు దక్కుతున్నా… పేరొందిన కంపెనీలో ఉద్యోగ లక్ష్యం మాత్రం ఏ కొద్దిమందికో నెరవేరుతోంది. మంచి జీతం ఇచ్చే కంపెనీల్లో కొలువులకు తీవ్ర పోటీ ఉంటోంది. పోటీ ప్రపంచంలో కొలువులను చేజిక్కించుకోవాలంటే.. సంప్రదాయబద్ధ చదువులకు చరమగీతం పలికి.. వినూత్నంగా విద్యార్థులు ఆలోచించి తొలి ఏడాది నుంచే కసరత్తు ప్రారంభించాల్సి ఉందని.. తరగతి గదిని దాటి వెళ్లినప్పుడు నిలదొక్కుకునేందుకు పుష్కలంగా అవకాశాలు ఎదురొస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. కొలువులు తక్కువగా ఉండి.. విద్యార్థుల మధ్య విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో వడపోత కోసం కంపెనీలు చాలా మార్గాలను ఎంచుకుంటున్నాయి. సైకో మెట్రిక్స్‌, ఉన్నతస్థాయిలో గణితంపై పట్టు, సంజ్ఞాత్మక నైపుణ్యాలు (కాగ్నెటివ్‌ స్కిల్స్‌), ఆంగ్లంపై పూర్తిస్థాయిలో పట్టున్న వారి కోసం వెతుకుతున్నాయి. ఇప్పటివరకూ సంప్రదాయ బద్ధమైన చదువులతో నెట్టుకొస్తున్న 90 శాతం విద్యార్థులు ఈ
వడపోతలో పక్కకు వెళ్లిపోతున్నారు.ఈ తరుణంలో వీటన్నింటిపై పట్టు సాధించిన. వారికే ఉద్యోగ దారులు తెరుచుకుంటున్నాయి. కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా సిద్ధమై ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుంటు న్నాయి. కొద్దిగా శిక్షణ ఇస్తే.. చాలు దూసుకెళ్లిపోతారనే వారినే ఎంచుకుంటున్నాయి. ఇలాంటి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరమూ ఉండదనే కోణంలో సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో కొలువు సాధించాలంటే ఆంగ్లంతో ఆడుకోవాల్సిందే. ప్రస్తుతం మామూలు ఆంగ్లం ఉంటే.. వారి వైపు కూడా కంపెనీలు చూడడం లేదు. చాలా కఠినమైన ఆంగ్లం కోరుకుంటున్నాయి. అందుకే తొలి ఏడాది నుంచి నిత్యం ఆంగ్లంపై సాధన చేస్తూనే ఉండాలి. జీవితంలో ఇదో ప్రధానభాగమనే అంశాన్ని గుర్తించాలి. ప్రస్తుతం 70శాతం మంది విద్యార్థులు ఆంగ్లంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఉండడంతో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు.
కొలువు సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి ఇంజినీరింగ్‌పై అవగాహన, ప్రోగ్రామింగ్‌పై పట్టు, సంజ్ఞాత్మక నైపుణ్యాలు, ఆంగ్లంపై పూర్తిపట్టు సాధించాలి. ఏ కంపెనీలో కొలువు కోసం వెళ్తున్నారో.. వారి అవసరాలేంటి, ఏ సాంకేతికత వాడుతున్నారనేవి తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న బట్టీ పట్టే విధానంలో చదువులు పూర్తిచేసుకుని వస్తున్న విద్యార్థులే 90 శాతానికి పైగా ఉంటున్నారు.