సంస్కృతం అధికారభాషగా ఆచరణ సాధ్యంకాదు 

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌
న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నంసాక్షి) : భారతదేశంలో సంస్కృతాన్ని అధికార భాషగా చేయాలనే వాదనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంస్కృతం అద్భుతమైన భాష అని, అయితే అది సులువైన భాష కాదని చెప్పారు. మన దేశంలో అత్యధికులు సంస్కృతం మాట్లాడటం లేదన్నారు. జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ చైర్మన్‌ నంద్‌ కుమార్‌ సాయి ఇటీవల మాట్లాడుతూ తాను సంస్కృతాన్ని అధికార భాషగా చేయాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరుతానని చెప్పారు. సంస్కృతం చాలా ప్రాచీన భాష అని తెలిపారు. దీని ప్రభావం అనేక భాషలపై ఉందన్నారు. భాషల ఉపయోగంపై వస్తున్నవివాదాలన్నిటికీ సంస్కృతం ముగింపు పలుకగలదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. దీనిని అధికార భాషగా చేయాలన్నారు. దీనిపై శశి థరూర్‌ స్పందించారు. ప్రజలు అర్థం చేసుకోగలిగేవిధంగా, చదవడం, రాయడం బాగా వచ్చే విధంగా చేయడానికి మన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి మనం శ్రమిస్తున్నామని శశి థరూర్‌ తెలిపారు. అకస్మాత్తుగా సంస్కృతాన్ని అధికార భాషగా కానీ, జాతీయ భాషగా కానీ చేయడం చాలా ప్రయాసతో కూడుకున్నదని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఇంతకు ముందే తీసుకుని ఉండవలసిందన్నారు. ఈ భాషను సజీవంగా ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే ఇప్పటికిప్పుడే దీనిని పరిపాలనా భాషగా, న్యాయ వ్యవస్థ భాషగా మార్చడం ఆచరణాత్మకం కాదన్నారు. ఇది యథార్థాలతో కూడిన అభ్యర్థన కాదని పేర్కొన్నారు.