సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

సింగరేణి మైదానంలో ఆవిర్భావ వేడుకలు

భద్రాద్రికొత్తగూడెం,మే30(జ‌నంసాక్షి): తెలంగాణ అవతరణ వేడుకలకు జిల్లాకు చెందిన ఎంపీలు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక అతిధులుగా రానున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. స్టేడియం గ్రౌండ్‌ను ఆకర్షణీనీయంగా తీర్చిదిద్దుతున్నారు. సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా రానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎన్నో పోరాటాలు… ఉద్యమాలు…ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ వేడుకలను అంబరాన్ని అంటేలా… నిర్వహించేందుకు జిల్లా యంత్రాగం సన్నద్దమవుతోంది. అన్ని మండల కేంద్రాలు , పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దుకాణాలను, ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించే విధంగా ప్రత్యేక శోభాయమానంగా తీర్చి దిద్దాలని ఇందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించినవారిని ఎంపిక చేసి సత్కరించాలని సూచించారు. జిల్లాలోని 23 మండలాలతో పాటు, నాలుగు మున్సిపాలిటీలలో జూన్‌ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను ధూంధాంగా నిర్వహించి కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేకతను సంతరింపజేయాలని కలెక్టర్‌ అధికార యంత్రాంగానికి తెలియచెప్పారు. జిల్లా కేంద్రంలోకూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.