సకాలంలో అందని ఆసరా పెన్షన్లు

ఆదిలాబాద్‌,మే19(జ‌నం సాక్షి):ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల కోసం గ్రామాల్లో పండుటాకులు ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రతి నెల ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తుంటారు. ప్రతి నెల 1 నుంచి 10 లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి. అలాంటిది గత ఏప్రిల్‌ నెల డబ్బులు ఇప్పుడు ఇస్తున్నారు. వీటి కోసం వృద్ధులు ఇప్పటి వరకు నిత్యం కార్యాలయాల ముందు పడిగాపులు పడ్డారు. తమ అవస్థలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఎండాకాలంకావడంతో తిప్పలు మరింతగా ఉన్నాయి. మే నెల నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆసరా పథకం కింద దివ్యాంగులకు ప్రతి నెల రూ.1,500 పింఛను ఇస్తున్నారు. వితంతు, చేనేత, కల్లు గీతాకార్మికులు, బీడీ కార్మికులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారు.జిల్లావ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న వారిలో తంతువులే ఎక్కువగా ఉంటారు. ఆ తర్వాతి స్థానంలో వృద్ధులు ఉంటారు. ఆసరా పింఛను కింద వచ్చే డబ్బుతోనే రేషన్‌ సరకులు, ఇతర నిత్యవసరాలు కొనుగోలు చేసే నిరుపేదలు జిల్లాలో ఎక్కువ మందే ఉంటారు.
—-