సత్ఫలితాలు ఇస్తున్న అటవీ సంరక్షణ చర్యలు

ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీగా అడవుల పెంపకం

పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో పచ్చని కళ

ఆదిలాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అడవుల పెంపకం కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ధ్వసంమైన అడవులను కాపాడుకుంటూ, కొత్తగా నరికివేతలను అడ్డుకోవడం కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మరోవైపు హరితహారంలో మొక్కల పెంపకంతో అడవులను అభివృద్ది చేస్తున్న కార్యక్రమాలుకూడా జోరందుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న అటవీప్రాంతాన్ని ప్రస్తుతం నాలుగు జిల్లాల పరిధిలోకి విభజించారు. దట్టమైన అడవులను కాపాడుకోవడంతోపాటు ఇప్పటికే నరికివేతకు గురైన అడవులను కాపాడేందుకు అటవీశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు అటవీ డివిజన్లు ఉండగా కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత వాటిని 11 డివిజన్లకు పెంచారు. ప్రతి డివిజన్‌లో డివిజన్‌లో వెయ్యి హెక్టార్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. అందులో భాగంగా జిల్లా ఇప్పుడు నాలుగు జిల్లాలుగా ఏర్పాటు అయింది. అటవీశాఖ సైతం అందుకు అనుగుణంగా విభజించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇప్పుడు మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం జిల్లాలుగా ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు అటవీ డివిజన్లు ఆదిలాబాద్‌, నిర్మల్‌, జన్నారం,మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ డివిజన్లు ఉండేవి. వివిధ కారణాలతో పలుచబడ్డ అటవీ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. వాటిల్లో మొక్కలు పెంచి అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సర్వే చేసి పలుచబడిన అడవులను గుర్తించారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న చెట్ల సంఖ్యను లెక్కకట్టారు. చెట్లు లేకుండా పోయిన చోట మొక్కలు నాటడంతో పాటు ఉన్నవాటిని కాపాడుతున్నారు. పశువులు, మనుషులు వెళ్లడానికి వీల్లేకుండా రక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారులు ప్రణాళికలు సిద్థం చేశారు. గుర్తించిన అటవీ ప్రాంతంలో రకరకాలైన మొక్కలు నాటుతున్నారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి మొక్కలు నాటనున్నారు. వాటిల్లో ప్రస్తుతం ఎన్ని చెట్లు, పొదలున్నాయో లెక్కలు తీశారు. ఉన్న వాటిని కాపాడటానికి ఆ ప్రాంతంలోకి పశువులు మేతకు వెళ్లకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాంతాన్ని చుడుతూ కందకాలు తవ్వుతున్నారు. దీనివల్ల పశువులు వెళ్లలేకపోవడమే కాకుండా వంటచెరుకు కోసం మనుషులు కూడా లోపలకు వెళ్లడానికి వీల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్నిప్రమాదాలతో అటవీప్రాంతానికి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అడవులు తక్కువగా ఉన్న ‘డి’ గ్రేడు అటవీ ప్రాంతాన్ని గుర్తించారు. ఈ లెక్కన ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు వేల హెక్టార్లలో అటవీ ప్రాంతాన్ని మరింతగా విస్తరించనున్నారు. ప్రతి డివిజన్‌లో కూడా వెయ్యి హెక్టార్ల చొప్పున నాలుగువేల హెక్టార్లలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.