సమగ్ర వ్యవసాయ విధానం రావాలి

స్వాతంత్య్రం లభించి 70సంవత్సరాలు పూర్తయినా ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో రైతుల సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన వ్యవసాయిక విధానం లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారిపోయింది. రైతుల సమస్యలను పట్టించుకునే దిశగా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఏటా ఒక విధానంగా గాకుండా, రుణమాఫీలు అవసరం లేని విధంగా రైతులు స్వయం సమృద్దిగా ఎదిగేలా చేయాలి. సస్య విప్లవానికి నాంది పలకాలి. ఫ్రీ మార్కెట్‌ అనేది ఒక అభూత కల్పన మాత్రమే అయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థ 8నుంచి 9శాతం వరకూ వృద్ధి జరుగుతున్న ప్పటికీ, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతన్నా రైతుల ఆర్థిక వ్యవస్థ మాత్రం బాగుపడడం లేదు. అవసరం లేకున్నా ఇబ్బడిముబ్బడిగా ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవడం కూడా రైతులకు శాపంగా మారింది. బహుళ జాతి కంపెనీలకూ ఎర్ర తివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. విత్తనాలు, పురుగు మందుల వ్యాపారస్థులు నకిలీలతో రైతులను నిలువునా ముంచుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. బ్యాంకు అధికారులు, ఏజెంట్లు కలిసి రైతులకిచ్చే ఋణాలలో కోత పెడుతున్నారు. అడ్తిదారులు, కవిూషన్‌ ఏజెంట్లు, మార్కెట్‌ అధికారులు, అంతిమంగా అందరూ రైతులను ముంచడానికే సిద్దంగా ఉంటున్నారు. ఇకపోతే విదేశాల నుంచి నూనెల దిగుమతి వేరుశనగ రైతులకు శరాఘాతంగా మారింది. పంటల విధానంలో శాస్త్రీయ దృక్పథం లోపించడం, సేంద్రియ ఎరువుల బదులు రసాయన ఎరువులు వాడడం వల్ల భూవిూ సారం తగ్గుతోంది. ఏ పంటపండించినా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. దీనికి తాజా ఉదాహరణ కంది, మిర్చి పంటలే. కల్తీలు కూడా రైతును కాటేస్తున్నాయి. మన అసవరాలకు సరిపడా కందులు, మిరప, ఇతర పంటలను రైతులు చెమటోడ్చి పండించినా వాటిని కొనుగోలు చేయడం లేదు. రైతుల సమస్యలు రాజకీయ పక్షాలకు ప్రచార కార్యక్రమంగానే మిగిలిపోయాయి. పాలకపక్షం అయినా, ప్రతిపక్షం అయినా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఆలోచించడం లేదు. గిట్టుబాటు ధరలు లేక వచ్చిన ఆదాయం కూలీల ఖర్చుకు సరిపోతుంది. ప్రతి ఎకరాకు కౌలు 10 వేల నుంచి 25 వేల రూపాయల వరకు భూమి యజమానులకు చెల్లించవలసి వస్తుంది. లక్షలాది మంది రైతులు వర్షాలు కురిసి కాలం మంచిగా అయినప్పటికీ ధరలు రాక నష్ట పోతున్నారు. వర్షాలు లేని సంవత్సరంలో పంటలు ఎండిపోయి నష్ట పోతున్నారు. కాలం అయినా గాని, కరువు అయినా గాని రైతుకు మిగిలేది అప్పులే. మార్కెట్‌లో రైతును దోచుకునే శక్తులు నిరాటంకంగా విజృంభిస్తూనే ఉన్నాయి. రైతులను దోచుకుంటున్న వారికి తిండి ఎలా వంటబడుతుందో అర్థం కావడం లేదు. రైతులకి మేలు చేస్తానన్న ప్రభుత్వాల ప్రకటనలు ఆచరణలోకి రావడం లేదు. అంతెందుకు రైతులకు గిట్టుబాటును మించి ధరలు దక్కేలా చేస్తామన్న ప్రధాని మోడీ కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు. వ్యవసాయ ఉత్పత్తి వ్యయాలు అనేక రెట్లు పెరిగిపోవడంతో పాటు విత్తనాల దగ్గర నుంచి నకిలీలు రైతులను కుంగదీస్తున్నాయి. చాలామంది రైతులు, కౌలుదారులు బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు, వడ్డీ వ్యాపారస్థుల దగ్గర అప్పు తీసుకుంటే తడిసి మోపెడవుతుంది. ఈ సమస్యలను అధిగమించి రైతుకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు రుణామాఫీ ప్రకటించి మొక్కుబడి తీర్చుకుంటున్నారు. దీంతో సమస్య తాత్కాలిక ఉపశమనం కలిగిస్తోంది తప్ప సమస్యను శాశ్వతంగా దూరం చేయడం లేదు. ఇదే సమయంలో అప్పుల ఊబినుంచి బయటపడడానికి ఆత్మహత్యలను వీరు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా రైతుల కుటుంబాలు మరింతగా ఊబిలో చిక్కుకుని పోతున్నాయి. తెలంగాణలో పరిస్థితిని మార్చేలా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నారు. రైతులకు పెట్టబడతో పాటు రాయితీ విత్తనాలు, ఎరువులు అందుతున్నాయి. అలాగే బీమా సౌకర్యం రాబోతున్నది. ఇకపోతే 24 గంటల ఉచిత కరెంట్‌ అందుతోంది. సేందరియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు పెంచాలి. అంతేగాకుండా బలవంతంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఇవన్నీ జాతీయస్థాయిలో జరగాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలుకూడా తెలంగాణ తరహాలో చొరవ తీసుకోవాలి. అప్పుడే మార్పు కనిపిస్తుంది. రైతులకు భరోఎసా దక్కి వ్యవసాయం ముందుకు సాగుతుంది. మనరైతులనే ప్రోత్సహించి మన పంటలనే కాపడుకునేలా రైతాంగ విధానాలు వస్తే తప్ప వారు బతికి బట్ట కట్టేలా లేరు. కరువులు వచ్చినా, వర్షాలు కురిసినా రైతుల దుర్భర పరిస్థితులలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు పట్టణాలకు వలస వెళ్ళి దినసరి కూలీలుగా మారుతున్నారు. చిన్నాచితక వ్యాపారాలతో తోపుడు బళ్లు నడుపుతున్నారు. వ్యవసాయభూమి లేని కూలీలు కౌలుకు తీసుకొని నష్టాలపాలయి బ్రతుకునీడ్చలేక, అవమానం భరించలేక, చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులని కాపాడుకుని, వ్యవసాయాన్ని పండగ చేస్తామంటున్న ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయాలి. చిత్తశుద్ధితో పనిచేసే వ్యవస్థను రూపొందించాలి. రైతులను ఓటు బ్యాంకుగా చూడకుండా మనకు పట్టెడు అన్నం పెట్టే తల్లిగా చూసుకోవాలి.