సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం 

అధికారుల తీరుతో ముందుకు సాగని వైనం
రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌4 (జనంసాక్షి):   రాజన్నసిరిసిల్ల జిల్లాలో కార్మికులు, వలసలతో పేదరికంతో
సతమతమవుతున్న వారే అధికంగా ఉంటారు. ఇక్కడి ప్రజల జీవనప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పలు పథకాలు ప్రజలకు చేరువకావడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. మంత్రి కెటిఆర్‌ పదేపదే హెచ్చరిస్తున్నా, ఆదేశాలు ఇస్తున్నా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొట్టొచ్చిన్టుల కనిపిస్తోంది. జిల్లాలో ఎస్సీలు1.13లక్షలు, ఎస్టీలు25వేలు, వెనుకబడిన తరగతుల వారు 3.5లక్షల మంది ఉన్నారు. వీరికి ఆయా కార్పొరేషన్ల ద్వారా ఏటా రుణాలు కేటాయిస్తారు. ఉకొత్తరుణాలకోసం దరఖాస్తు చేసుకున్నా పరిశీలించే అధికారులు ఇన్‌ఛార్జులుగా కొనసాగుతుండటంతో జాప్యం జరుగుతోంది. అన్నదాతలకు అధికారుల చేయూత కరవైంది. జిల్లాలో చిన్నసన్నకారు రైతులతోపాటు భూస్వాములు  ఉన్నారు. వేలఎకరాల్లో వివిధరకాల పంటలు సాగవుతుంటాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆధునికతవైపు నడిపించేందుకు అనేకరకాల పథకాలు అమలుచేస్తున్నా జిల్లా రైతులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. మెట్టప్రాంతమైన జిల్లాలో సాగునీటి కొరతను  అధిగమించేందుకు రైతులకు బిందు,
తుంపర సేద్యం పరికరాలను అందించేందుకు నిధులు కేటాయించారు. లబ్దిదారుల ఎంపిక పరికరాల పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో నేటికీ దరఖాస్తు చేసుకున్న రైతులకు పరికరాలు అందలేదు. జిల్లా వ్యవసాయాధికారి నియామకంలో జాప్యం జరుగుతుండటంతో వ్యవసాయ, దాని అనుబంధశాఖల ద్వారా రైతులకు అందాల్సిన రాయితీలు అందడంలో తీవ్రజాప్యం జరుగుతోంది.రహదారులు భవనాలశాఖ పరిధిలోనూ పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌కాకతీయ పనులు జిల్లాలో పురోగతి అంతగా కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉపాధిహావిూ పథకాన్ని ఈ ఏడాది జిల్లాలో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు.  దీనికితోడు ఇందిరాక్రాంతిపథం, గ్రావిూణాభివృద్ధి శాఖలు విలీనంచేయడంతో అధికారులు ఏశాఖకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలేదు. వైద్య ఆరోగ్య శాఖలో ఇన్‌ఛార్జుల పాలనతో ప్రజలకు ఆరోగ్యసేవలు అందనిద్రాక్షగా మిగిలాయి. వీటితోపాటు వయోజనవిద్య, గిరిజనసంక్షేమశాఖ, దేవాదాయశాఖ, పర్యాటకం, కార్మికశాఖలు విభజనకు నోచుకోకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా కొనసాగుతోంది.