సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలి : మంత్రి హరీశ్‌రావుసమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలి : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌: రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీ విస్తరణలో భాగంగా ఈరోజు కొత్త భవనానికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.డబ్బులు సంపాదించే విద్యా సంస్థగా కాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించి సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలని మంత్రి అన్నారు. పేద గ్రామీణ యువత ఉన్నత విద్యను చాలా తక్కువ ఖర్చుతో అభ్యసించడానికి ఈ సంస్థ సేవలు అందిస్తుందన్నారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం రాజా బహదూర్ వెంకట రామారెడ్డి చేసిన కృషి ఈరోజు ఎంతోమంది పేద గ్రామీణ విద్యార్థినిలకు అవకాశాన్ని కల్పించిందని కొనియాడారు. వసతి గృహ సముదాయాన్ని ఏర్పాటు  కోసం బద్వేల్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి సీఎం కేసీఆర్‌ గొప్ప మనసు చాటుకున్నారన్నారు. భారత మాజీ ప్రధాని దివంగత శ్రీ పి.వి.నరసింహారావు, స్వర్గీయ శ్రీ రావి నారాయణరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఎస్. జైపాల్ రెడ్డి, జస్టిస్ ఎ. సీతారాంరెడ్డి, జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డి, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, తదితర ప్రముఖులు రాజా బహదూర్ వెంకట రామారెడ్డి హాస్టల్లో ఉన్నవారే అని మంత్రి పేర్కొన్నారు.