సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం

అక్రమ మద్యం కట్టడికి చర్యలు

ఆదిలాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీని పకడ్బందీగా నిరోధించడానికి ఎక్సైజ్‌ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా సరిహద్దు గుండా దేశీదారు అక్రమంగా రవాణా కాకుండా నిఘా ఏర్పాటు చేశారు. మూడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24గంటల పాటు వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు.జిల్లాకు ఆనుకొని మహారాష్ట్ర ఉండడంతో ఎన్నికల నేపథ్యంలో అక్కడి నుంచి దేశీదారు ఇతర మద్యం అక్రమంగా జిల్లాకు రవాణా అయ్యే అవకాశాలున్నాయి. కాగా.. ఇప్పటికే ఎక్సైజ్‌ అధికారులు స్థానిక మద్యం దుకాణాలపై నిఘాను ఏర్పాటు చేసి రోజు వారీ కొనుగోళ్లు, అమ్మకాలపై ఆరా తీస్తున్నారు. సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి మద్యం జిల్లాకు తరలించే అవకాశాలుండగా.. సరిహద్దు ప్రాంతాలైన బోరజ్‌, లక్ష్మీపూర్‌, ఘన్‌పూర్‌ల వద్ద అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల వద్ద తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క బృం దానికి బాధ్యతలను అప్పగించారు. రాష్ట్ర సరిహద్దులో నిఘా ను కొనసాగించడానికి ప్రత్యేకంగా మొబైల్‌ బృందాలు ఏర్పాటు చేశారు. బృందం సరిహద్దున ఉన్న పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల్లో 24గంటల పాటు పర్యటిస్తూ జిల్లాలోకి బయట నుంచి మద్యం తరలించకుండా నిఘాను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల కోసం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ఓ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి చాకచక్యంగా పట్టుకుంటున్నారు. ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 కేసులు నమోదు కాగా.. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సరిహద్దు చెక్‌పోస్టు గుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొబైల్‌ బృందం, జిల్లా టాస్క్‌ఫోర్స్‌, స్టేషన్ల వారీగా బృందాలు, సమాచార సేకరణకు మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల కోసం జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయంలో కం ట్రోల్‌ రూంను ఏర్పాటుచేసి టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.టోల్‌ ఫ్రీ నంబర్లకు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. సరిహద్దు ప్రాంతాల వద్ద ఎక్సైజ్‌ అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.