సర్పంచ్ సీటు… యమ హాట్ గురూ…… 

జాతరను తలపిస్తున్న గ్రామాలు
పల్లెల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల చక్కర్లు

బిచ్కుంద (జనంసాక్షి) తమ గ్రామంలో పట్టు ఉంటే ‘ఆ కిక్కే వేరప్పా’ అని సర్పంచ్ పోటీకి సన్నద్ధం అయిన అభ్యర్థులు అనుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మండలకేంద్రంతో పాటు గ్రామాలలో జాతర, పండుగ వాతావరణం కనబడుతోంది. ఆకాశంలో సూర్యుడు కనబడుతున్నప్పటి నుండి సాయంత్రం అస్తమించే వరకు ఇంటింటికీ తిరిగి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం అయిన అభ్యర్థులు ఖర్చులు వరదలా పారనుందా అంటే అవుననే అనిపిస్తుంది. కొన్ని చోట్ల నామినేషన్ల పర్వం మొదలుకుని పోలింగ్ తేది వరకు ఎన్నికల ఖర్చు వేలల్లో కాదు లక్షలలో ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల 15 నుంచి 20 లక్షల పైన దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. బిచ్కుంద మండలంలోని 27 పంచాయతీలలో కొన్ని చోట్ల నజరానాలకో, బెదిరింపులకో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన గ్రామ పంచాయతీల్లో వచ్చే బుధవారం రోజున ఎన్నికలు జరుగనున్నాయి.

గెలుపే లక్ష్యంగా పావులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.  ఉదయం, సాయంత్రం వేళల్లో అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఓటర్లను తమవైపు తిప్ప కోవడానికి తెలిసిన వారితో సంప్రదింపులు జరుపుతూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాల్లో సర్పంచ్ అభ్యర్థులు 30 నుండి 50 లక్షల రూపాయల వరకూ ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధాన పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. ప్రతి గ్రామాలలో తక్కువ పోటీలు ఉండేలా ఇప్పటికే జాగ్రత్త పడ్డారు. ఇక పోటీల్లో ఉన్న అభ్యర్థులు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండని, గ్రామాభివృద్ధియే ధ్వేయంగా పని చేస్తామని జనాన్ని హామీలు గుప్పిస్తున్నారు.