సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు

తొలివిడతగా 26 కోట్లు విడుదల
దరఖాస్తులకు మే 3 చివరితేదీ
భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో మత్స్యకార సొసైటీలను అర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం పేరుతో భారీ రాయితీలతో పలు యూనిట్లను మంజూరు చేసింది. వీటికోసం జిల్లాకు రూ.26 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తు పక్రియ మే 3వ తేదీ వరకు కొనేసాగుతుంది.  ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి మత్స్యకారుడు సద్వినియోగం చేసుకోవాలని మత్స్యశాఖ జిల్లా అధికారి బుచ్చిబాబు సూచించారు. నిర్ణీత దరఖాస్తు ఫారం పూర్తిచేసి నేరుగా జిల్లా మత్స్యకార కార్యాలయంలో అందజేయవచ్చు. లేని పక్షంలో ఆన్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు. దరఖాస్తులో వివరాలు సమగ్రంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, తాము సభ్యత్వం తీసుకున్న మత్స్య సహకార సంఘం వివరాలు, రిజిస్టేష్రన్‌ సంఖ్య, ఆ సంఘంలో దరఖాస్తుదారుని సభ్యత్వం సంఖ్య, వాహనాలకు సంబంధించిన యూనిట్లకైతే డ్రైవింగ్‌ లైసెన్స్‌, భూ ఆధారిత యూనిట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్‌ జత చేయాల్సి ఉంటుందన్నారు. ప్రాథమిక మత్స్య సహకార, మహిళా మత్స్య సహకార, మత్స్యకార మార్కెటింగ్‌ సహకార సంఘాల్లో నమోదైన సభ్యులు, లేదా సభ్యుల గ్రూపులు, జిల్లా మత్స్య సహకార సంఘాలు ప్రయోజనం పొందేలా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం రూపొందించారు. 18ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన లబ్ధిదారులు యూనిట్‌ విలువలో లబ్ధిదారుని వాటా చెల్లించాల్సి ఉంటుంది. సంఘాల పరంగా లబ్ధిపొందాలనుకునే వారు ఆడిట్‌ నివేదిక అందజేయాల్సి ఉంటుంది. కొత్తగా రిజిస్టేష్రన్‌ చేసుకునే సంఘాలకైతే ఈ నిబంధన వర్తించదని బుచ్చిబాబు వివరించారు.  పెరిగిన చేపలను పట్టడం, విక్రయించుకొనేందుకు మత్స్యశాఖ సొసైటీలు వనరులు లేక వెనుకబడి ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు జిల్లాకు రూ.26 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకం విధి విధానాలను సమగ్రంగా వివరిస్తూ జిల్లావ్యాప్తంగా మత్స్యశాఖ సొసైటీ సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ పరిణామంతో మత్స్యశాఖ సొసైటీల్లో ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి. మిషన్‌ కాకతీయలో భాగంగా ప్రతీ పల్లెలో చిన్న నీటి వనరులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. సాగునీరు అందించడంతోపాటు చేపల అభివృద్ధికి కూడా వినియోగించాలని రెండేళ్లుగా ప్రతీ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చేపలు వదిలే కార్యక్రమం చేపట్టింది.